Bharathiraja | సీఎం విజయ్ భావోద్వేగం

Bharathiraja | సీఎం విజయ్ భావోద్వేగం

Bharathiraja | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్: తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన 84 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. భారతీరాజా మరణవార్త తెలియగానే తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. చెన్నై నీలాంకరైలోని దర్శకుడి నివాసానికి స్వయంగా చేరుకున్న సీఎం విజయ్.. భారతీరాజా పార్థివ దేహానికి పూలమాల వేసి చేతులు జోడించి అంజలి ఘటించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదారుస్తూ తన గాఢ సానుభూతిని తెలియజేశారు. తమిళ సినిమా రంగానికి పితామహుడి లాంటి వ్యక్తిని కోల్పోయామంటూ సీఎం విజయ్ భావోద్వేగానికి గురైన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విజయ్ తండ్రి ఎస్.ఏ. చంద్రశేఖర్‌తో భారతీరాజాకు దశాబ్దాల కాలంగా ఎంతో సన్నిహిత స్నేహబంధం ఉంది. సుమారు 30 ఏళ్ల క్రితం విజయ్‌తో ఒక సినిమా చేయాల్సిందిగా ఆయన తండ్రి కోరగా, భారతీరాజా అప్పట్లో సున్నితంగా తిరస్కరించారు. అయినప్పటికీ వారి కుటుంబాల మధ్య ఉన్న ఆత్మీయత, స్నేహం ఇప్పటికీ అలాగే కొనసాగింది.

1941 జులై 17న జన్మించిన భారతీరాజా, తమిళ సినిమాకు గ్రామీణ జీవనశైలి, సహజత్వం, భావోద్వేగ కథనాలకు కొత్త రూపు తీసుకువచ్చిన దర్శకుడిగా గుర్తింపు పొందారు. ‘పదహారేళ్ల వయసు’, ‘సీతాకోక చిలుక’, ‘ఆరాధన’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకూ చేరువయ్యారు. ఆయన మరణంతో తమిళ చిత్రసీమలో విషాదఛాయలు అలుముకున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులు భారతీరాజా సేవలను స్మరించుకుంటూ నివాళులర్పిస్తున్నారు.

అధికారిక లాంఛనాలతో వీడ్కోలు
తమిళ చలనచిత్ర పరిశ్రమకు, కళారంగానికి భారతీరాజా చేసిన అసమానమైన సేవలకు గుర్తింపుగా ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి విజయ్ ప్రకటించారు.