నాడు ఓటు చోరీ నేడు సీటు చోరీ..

నాడు ఓటు చోరీ నేడు సీటు చోరీ..

ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్న బిజెపి.
ఎన్నికల సంఘం పూర్తి వివరాలు వెల్లడించాలి
రాజ్యాంగ సంస్థల స్వతంత్రతను కాపాడాలి
ఏపీ సి సి రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్ షర్మిల రెడ్డి

విజయవాడ, ఆంధ్రప్రభ : మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ఘటనపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటిదాకా ఓటు చోరీ జరిగితే, ఇకపై సీటు చోరీ జరుగుతోంది అంటూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రజాస్వామ్య వ్యవస్థలపై నిరంతరం దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. ఎన్నికల సంఘాన్ని స్వతంత్ర రాజ్యాంగబద్ధ సంస్థగా కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నారనే అనుమానాలకు మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ మరింత బలం చేకూర్చిందన్నారు.

మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ బీజేపీతో కలిసి ఎన్నికల సంఘం చేసిన రాజకీయ కుట్రగా కనిపిస్తోందని షర్మిల వ్యాఖ్యానించారు. ప్రజల తరఫున పోరాడే నాయకులను రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక, కేసులు, సాంకేతిక కారణాలు, నిబంధనల పేరుతో ఎన్నికల బరిలోకి రాకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని విమర్శించారు. రాజ్యాంగ విలువలను పరిరక్షించాల్సిన సంస్థలు అధికార పార్టీ ఒత్తిడికి లోనవుతున్నాయనే అభిప్రాయం ప్రజల్లో కలుగుతోందని ఆమె పేర్కొన్నారు.

మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గల పూర్తి కారణాలను ఎన్నికల సంఘం పారదర్శకంగా ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజ్యాంగబద్ధ సంస్థల స్వతంత్రత కోసం దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఈ ఘటనను ఖండించాలని వైఎస్ షర్మిల రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజల గొంతును అణచివేసే ప్రతి ప్రయత్నాన్ని ప్రజాస్వామ్య శక్తులు ఐక్యంగా ఎదుర్కోవాలి అని ఆమె పేర్కొన్నారు.