త్వరితగతిన అభివృద్ధి పనులు..

త్వరితగతిన అభివృద్ధి పనులు..

అన్నప్రసాదం, లడ్డు పోటు భవనాల పనులు వేగవంతం చేయాలి
గడువులోగా నిర్మాణాలు పూర్తి చేయాలి
దుర్గగుడి చైర్మన్ బొర్రా గాంధీ..
నిర్మాణ పనులను పరిశీలించిన ధర్మకర్తల మండలి చైర్మన్, ఈవో

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : అమ్మవారి ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) సూచించారు. దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన కార్యనిర్వహణాధికారి వి.కె. శీనానాయక్ సంయుక్తంగా పరిశీలించారు. దేవస్థానంలో నూతనంగా నిర్మిస్తున్న అన్నప్రసాదం భవనం, లడ్డు పోటు భవనాల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ పనుల పురోగతి, ప్రస్తుత స్థితిగతులపై ఆలయ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శ్రీమతి ఎల్. రమాదేవిని అడిగి తెలుసుకున్నారు. పనుల నాణ్యతతో పాటు నిర్ణీత ప్రణాళిక ప్రకారం నిర్మాణాలు కొనసాగుతున్నాయా అనే అంశాలపై సమీక్ష నిర్వహించారు.

భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో ఈ భవనాలు కీలకంగా నిలుస్తాయని పేర్కొన్న చైర్మన్, ఈవో నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. దేవస్థానం అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా చేపట్టిన ఈ నిర్మాణాలు పూర్తయిన అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ, లడ్డు తయారీ, పంపిణీ వ్యవస్థలు మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలు కలుగుతుందని అధికారులు తెలిపారు.