నారాయణలో విద్యా సామాగ్రి సీజ్..
నారాయణలో విద్యా సామాగ్రి సీజ్..
భీమవరం, ఆంధ్రప్రభ : భీమవరం మండలం రాయలంలో ఉన్న నారాయణ జూనియర్ కాలేజీలో పుస్తకాలు, విద్యాసామాగ్రి విక్రయిస్తుండగా భీమవరం పట్టణ ఎస్ఎఫ్ఐ నాయకులు మంగళవారం అడ్డుకున్నారు. ఎస్ఎఫ్ఐ నాయకులు ఇచ్చిన ఫిర్యాదుతో డీఐఈఓ కార్యాలయం నుండి సీనియర్ టి పెద్దిరాజు కాలేజీ వద్దకు వచ్చి పర్యవేక్షించి కంప్యూటర్ ల్యాబ్ లో ఉన్న పుస్తకాలు, విద్యాసామాగ్రిని సీజ్ చేసి నోటీసులు జారీ చేసారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్ఎఫ్ఐ భీమవరం పట్టణ అధ్యక్షకార్యదర్శులు పి సాయి కృష్ణ, ఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ భీమవరం పట్టణంలో ఉన్న నారాయణ సంస్థల్లో పుస్తకాలు, విద్యాసామాగ్రి పేరుతో విద్యార్థులు వారి తల్లిదండ్రుల వద్ద నుండి అధిక ధరలకు వేలకు వేలు దోపిడీ చేస్తున్నారన్నారు.
ప్రస్తుత కూటమి ప్రభుత్వం లో ఉన్న రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ విద్యా సంస్థలు కళ్లకు కట్టినట్టుగా విద్యా దోపిడీ జరుగుతున్న కేవలం అధికారంలో ఉన్నారనే ఉద్దేశంతో అధికారులు నిమ్మక నీరెత్తినట్టు ప్రవర్తించడం సిగ్గుచేటని తెలియజేశారు. భీమవరంలో విద్యా సంస్థలు విద్యతో వ్యాపారం చేయాలని ప్రయత్నిస్తే ఎస్ఎఫ్ఐ గా ఇదే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు కళ్ళు తెరుచుకొని కుర్చీలు కదిలించి విద్యతో వ్యాపారం చేస్తున్న విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ పట్టణ నాయకులు బీ సింధు,టీ రేష్మ, కే రోహిత్, సాయి ఫణి కుమార్ , తదితరులు పాల్గొన్నారు.
