కరెంట్ కోతలతో ఆక్వా రైతుల ఆందోళన
కరెంట్ కోతలతో ఆక్వా రైతుల ఆందోళన
రొయ్యల చెరువులకు నష్టం
రాత్రి వేళల్లో గంటల తరబడి విద్యుత్ కోతలు..
నర్సాపురం, జూన్ 9, ఆంధ్రప్రభ: తీర ప్రాంత రైతులకు కరెంట్ కోతలు శాపంగా మారాయి. వేసవి కాలంలో వేళాపాళా లేకుండా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఇటు ప్రజలు, అటు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రాత్రి సమయంలో గంటల తరబడి కరెంట్ కోతలు ఉండటంతో ఆక్వా రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
నర్సాపురం తీర ప్రాంత నియోజకవర్గంలో అనేక మంది రైతులు ఆక్వా పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. మోనో టైగర్ రొయ్యల పెంపకాన్ని ఫిబ్రవరి నుంచి ఆగస్టు వరకు సాగు చేస్తారు. ఈ ఆరు నెలల పంటే రైతులకు జీవనాధారం. అందులోనూ ప్రస్తుత రెండు నెలలు ఎంతో కీలకమని రైతులు చెబుతున్నారు.
ఈ సమయంలో గంటల కొద్దీ విద్యుత్ సరఫరా లేకపోతే రొయ్యలకు ఆక్సిజన్ అందక చెరువుల్లో తేలిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత నెల నుంచి ఇప్పటివరకు రాత్రి వేళల్లో ఐదారు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో కంటి మీద కునుకు లేకుండా పోయిందని వాపోతున్నారు.
ఈ నేపథ్యంలో తూర్పు తాళ్లు గ్రామంలోని సబ్‌స్టేషన్ వద్ద రైతులు ఆందోళన చేశారు. అయినా సమస్య పరిష్కారం కాకపోవడంతో మంగళవారం తీర ప్రాంత రైతులు పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యే కార్యాలయానికి చేరుకుని ఎమ్మెల్యే నాయకర్ను కలిసి తమ గోడు వినిపించారు.
రోజుకు రెండు మూడు గంటల పాటు కోత ఉన్నా పర్వాలేదని, కానీ ఐదారు గంటల పాటు నిర్విరామంగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో రొయ్యల చెరువులను కాపాడుకోలేకపోతున్నామని రైతులు వివరించారు. ఇది రొయ్యల సాగుకు అత్యంత కీలక సమయమని, ఈ సమయంలో కరెంట్ లేకపోతే రైతులంతా తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరా లేక రొయ్యలకు డీఓ అందక తేలిపోతున్నాయని వాపోయారు.
ఇప్పుడిప్పుడే రొయ్యల సాగుపై ఆశలు చిగురిస్తున్నాయని, కరెంట్ కోతలతో ఆ ఆశలు అడియాశలు కాకుండా చూడాలని రైతులు వేడుకున్నారు. డీజిల్‌తో ఐదారు గంటల పాటు జనరేటర్ నడపడం తమకు సాధ్యం కాదని ఎమ్మెల్యేకు వివరించారు.
నేను కూడా ఆక్వా రైతునే: ఎమ్మెల్యే నాయకర్
ఆక్వా రైతుల గోడును ఆలకించిన ఎమ్మెల్యే నాయకర్ సానుకూలంగా స్పందించారు. తాను కూడా ఆక్వా రైతునేనని, రైతుల కష్టాలు తనకు తెలుసునని ఆయన తెలిపారు. తీర ప్రాంతాల్లో లోవోల్టేజ్ సమస్య పరిష్కారానికి వేములదీవిలో కొత్తగా సబ్‌స్టేషన్ ఏర్పాటుకు ఇటీవల భూమిపూజ చేసిన విషయాన్ని ఎమ్మెల్యే గుర్తు చేశారు.
వెంటనే విద్యుత్ శాఖ ఏఈ, డీఈలను కార్యాలయానికి రప్పించి, రైతుల సమస్యను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. తూర్పు తాళ్లు గ్రామంలోని విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద ప్రస్తుతం 5 ఎంవీఏ విద్యుత్ సామర్థ్యం ఉందని, దాన్ని 8 ఎంవీఏకు పెంచితే సమస్య పరిష్కారం అవుతుందని అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు.
కరెంట్ కోతలు లేకుండా అవసరమైన చర్యలు తీసుకుని రైతులకు అండగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు. రెండు రోజుల్లో సమస్య పరిష్కారం కావాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
ఎమ్మెల్యేను కలిసిన వారిలో అడ్డాల గోపాలకృష్ణ, అడ్డాల శ్రీను, వాతాడ ఉమామహేశ్వరరావు, ఓడుగు యేసు, ఘంటసాల బ్రహ్మాజీ, సిస్టా సుబ్రహ్మణ్యం, ఉంగరాల మురళీ, దేవిరెడ్డి రామచంద్రుడు, మైల మంగరాజు తదితర రైతులు ఉన్నారు.
