ఉండవల్లి గుహల్లో యోగా సందడి..

ఉండవల్లి గుహల్లో యోగా సందడి..

ఆరోగ్యవంతమైన జీవితానికి కలెక్టర్ పిలుపు!

ఉమ్మడి గుంటూరు బ్యూరో, ఆంధ్రప్రభ: ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని, ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో భాగంగా మార్చుకోవాలని గుంటూరు జిల్లా కలెక్టర్ సి.యం. సాయి కాంత్ వర్మ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో చారిత్రాత్మక పర్యాటక కేంద్రమైన ఉండవల్లి గుహల వద్ద ప్రత్యేక యోగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

అధికారులతో కలిసి యోగాభ్యాసం

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సి.యం. సాయి కాంత్ వర్మతో పాటు జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె. విజయలక్ష్మి, జిల్లా పర్యాటక అధికారి రమ్య తదితర జిల్లా స్థాయి అధికారులు, యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యోగా శిక్షకుల పర్యవేక్షణలో వివిధ రకాల ఆసనాలను ఉత్సాహంగా అభ్యసించారు. “అంతర్జాతీయ యోగా దినోత్సవం – మేము సిద్ధం” అనే నినాదంతో నిర్వహించిన ఈ కార్యక్రమం ఆకట్టుకుంది.

యోగా మన సాంస్కృతిక వారసత్వం

యోగాను మన పూర్వీకులు అందించిన అమూల్యమైన సాంస్కృతిక సంపదగా కలెక్టర్ అభివర్ణించారు. కేవలం ఆసనాలకు మాత్రమే పరిమితం కాకుండా ప్రాణాయామం వంటి సాధనలు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తాయని చెప్పారు. యోగాభ్యాసం ద్వారా ఆహారపు అలవాట్లు, పోషకాహారం, నీటి వినియోగం వంటి అంశాలపై అవగాహన పెరిగి ఆరోగ్యకరమైన జీవనశైలి అలవడుతుందని వివరించారు.

నిత్య యోగాభ్యాసం వ్యక్తిగత జీవితంలో క్రమశిక్షణను పెంపొందిస్తుందని, ఒత్తిడి లేని ఉత్సాహభరితమైన జీవితం గడపడానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం అనేక మందిని వేధిస్తున్న దీర్ఘకాలిక వ్యాధుల నియంత్రణలోనూ యోగాకు ప్రత్యేక ప్రాధాన్యం ఉందని అన్నారు.

యోగా దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలి

జిల్లావ్యాప్తంగా నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాలను ఆదర్శవంతంగా నిర్వహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా అన్ని వయసుల వారు యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొని యోగాపై తమ సంఘీభావాన్ని చాటాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

13న మంగళగిరిలో ప్రత్యేక యోగా కార్యక్రమం

జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 13వ తేదీన మంగళగిరిలోని ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద ప్రత్యేక యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

ఫొటో రైటప్: ఉండవల్లి గుహల వద్ద నిర్వహించిన ప్రత్యేక యోగా కార్యక్రమంలో పాల్గొని ఆసనాలు వేస్తున్న గుంటూరు జిల్లా కలెక్టర్ సి.యం. సాయి కాంత్ వర్మ, అధికారులు, యువత మరియు ప్రజలు.