లోకల్ ఎలక్షన్ లో వార్ వన్‌సైడ్ కావాలి : ఎమ్మెల్యే బడేటి
ఏలూరు, ఆంధ్రప్రభ బ్యూరో : రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించేలా, ఎన్నికలను ఏకపక్షంగా మార్చే దిశగా పార్టీ శ్రేణులు కృషి చేయాలని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పిలుపునిచ్చారు. ఈ నెల 27వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఇంటింటికీ కార్యక్రమంలో ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలో ప్రజలను కలిసి, కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించాలని సూచించారు.
శుక్రవారం ఏలూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్‌కు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. తమ సమస్యలను ఎమ్మెల్యే బడేటి చంటి దృష్టికి తీసుకువచ్చి, పరిష్కారం కల్పించాలని వినతిపత్రాలు అందజేశారు.

వినతులను స్వీకరించిన ఎమ్మెల్యే, సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకుని సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పలువురు ఇంటి స్థలాల కేటాయింపు కోరగా, మరికొందరు పెన్షన్ల మంజూరు కోసం దరఖాస్తులు సమర్పించారు. సమస్యల పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు.
ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రాధాన్యం
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. జులై 27 నుంచి ప్రారంభమయ్యే ఇంటింటికీ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమం 45 రోజుల పాటు నియోజకవర్గంలో కొనసాగుతుందని తెలిపారు. అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున, ప్రతి కార్యకర్త ప్రజలకు అందుబాటులో ఉండి పార్టీ విజయానికి కృషి చేయాలని సూచించారు. స్థానిక ఎన్నికల్లో కూటమి ఏకపక్ష విజయాన్ని సాధించేలా ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు చోడే వెంకటరత్నం, నాయకులు బెల్లపుకొండ కిషోర్, పలువురు కార్పొరేటర్లు, క్లస్టర్ ఇన్చార్జులు, డివిజన్ ఇన్చార్జులు పాల్గొన్నారు.
