Cocoa City Relocation : కోకో సిటీకి తూర్పు సెగ Andhra Prabha Top Story

Cocoa City Relocation : కోకో సిటీకి తూర్పు సెగ Andhra Prabha Top Story
- రైతుల్లో టెన్షన్ టెన్షన్ .
- తూర్పు వైపు సర్కారు చూపు
- భూసేకరణ గండం.. మరోవైపు ఓడరేవు సాకు
- 40 వేల ఎకరాల్లో కోకో భవిష్యత్తు ప్రశ్నార్థకం.
- ఏలూరు రైతుల్లో ఆందోళన.
( ఆంధ్రప్రభ , ఏలూరు బ్యూరో)
కోకో పంటకు ఏలూరు జిల్లానే అడ్డా. ఇక్కడే కోకో సిటీ కడతాం అన్న సీఎం చంద్రబాబు మాటలు ఇంకా చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ మాటలు గాల్లో కలిసిపోతాయేమోనన్న భయం జిల్లా కోకో రైతులను వెంటాడుతోంది. పెదవేగి మండలం విజయరాయిలో 370 ఎకరాల్లో ఏర్పాటు చేస్తామన్న ‘కోకో సిటీ’ని తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలానికి తరలిస్తున్నారన్న పుకార్లతో రైతుల గుండెల్లో గుబులు మొదలైంది.
Cocoa City Relocation : ఏపీ కోకో కేరాఫ్ ఏలూరే

ఏపీలో కోకో సాగుకు కేరాఫ్ అడ్రస్ ఏలూరు జిల్లా. ప్రభుత్వ లెక్కల ప్రకారమే రాష్ట్రవ్యాప్తంగా 80 వేల ఎకరాల కోకో సాగులో సరిగ్గా సగం, అంటే 40 వేల ఎకరాలు ఒక్క ఏలూరు జిల్లాలోనే ఉన్నాయి. జిల్లాలోని పెదవేగి, పెదపాడు, దెందులూరు, ద్వారకాతిరుమల, నూజివీడు మండలాల్లో రైతులు దశాబ్దాలుగా కోకో సాగు చేస్తున్నారు. గత రెండేళ్లుగా గిట్టుబాటు ధర లేక, ప్రాసెసింగ్ యూనిట్లు లేక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే సీఎం చంద్రబాబు విజయరాయిలో కోకో సిటీ ప్రకటించడంతో రైతుల్లో ఆశలు చిగురించాయి.
Cocoa City Relocation : ఉపాధికి కరువు లేని కోకో సిటీ

కోకో సిటీ అంటే కేవలం ఒక పరిశ్రమ కాదు. అది రైతుల బతుకులు మార్చే ఒక వ్యవస్థ. రైతు పండించిన కోకో గింజ నుంచి చాక్లెట్ తయారీ, ప్యాకింగ్, ఎగుమతి వరకు అన్నీ ఒకే ప్రాంగణంలో జరుగుతాయి. ప్రస్తుతం కిలో కోకో గింజకు రూ.150 నుంచి రూ.200 మాత్రమే వస్తోంది. ప్రాసెసింగ్ యూనిట్ వస్తే నేరుగా కంపెనీలు కొంటాయి. దీంతో రైతుకు కనీసం రూ.300 పైగా ధర దక్కుతుంది. కోకో సిటీలో 500 మందికి ప్రత్యక్షంగా, రవాణా, ప్యాకేజింగ్ వంటి అనుబంధ రంగాల్లో మరో 5000 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. కోకో సిటీ ఏర్పాటైతే జిల్లాలో సాగు లక్ష ఎకరాలకు చేరుతుందని ఉద్యానవన శాఖ అంచనా. అంతర్జాతీయ చాక్లెట్ దిగ్గజాలు క్యాడ్బరీ, నెస్లే వంటి కంపెనీలు నేరుగా రైతులతో ఒప్పందాలు చేసుకుంటాయి.
Cocoa City Relocation : తెరమీదకు భూమి సాకు

అధికారికంగా ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు. అయితే ఉన్నతస్థాయి అధికారుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం దేవరపల్లి మండలంలో 500 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉండటం, విశాఖ పోర్టుకు దగ్గరగా ఉండటం వల్ల తరలింపు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ ఏలూరు జిల్లా రైతులు ఈ వాదనను తోసిపుచ్చుతున్నారు. “విజయరాయిలో 370 ఎకరాలు, రామసింగవరంలో 172 ఎకరాలు సిద్ధంగా ఉన్నాయి. అంతేకాదు భవిష్యత్ అవసరాల కోసం మరో 500 ఎకరాలు సేకరించేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. పోర్టు దూరం అనేది సాకు మాత్రమే. గన్నవరం ఎయిర్పోర్టు, విజయవాడ రైల్వే జంక్షన్ మాకు అందుబాటులో ఉన్నాయి అని రైతు సంఘం నేతలు వాదిస్తున్నారు.
Cocoa City Relocation : రైతుల్లో ఆందోళన

కోకో సిటీ తరలింపు సమాచారంతో ఏలూరు జిల్లా వ్యాప్తంగా రైతులు రగిలిపోతున్నారు. గత వారం పెదవేగిలో జరిగిన సమావేశంలో 20 మండలాల రైతులు పాల్గొని ఆందోళన బాట పట్టాలని నిర్ణయించారు. “మా నమ్మకాన్ని వమ్ము చేయొద్దు. సీఎం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. లేకపోతే జిల్లా వ్యాప్తంగా రాస్తారోకోలు, ధర్నాలు చేస్తాం” అని జిల్లా కోకో రైతు సంఘం నాయకులు హెచ్చరించారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలకు రైతులు వినతిపత్రాలు ఇచ్చారు.
Cocoa City Relocation : ఇంకా నిర్ణయం తీసుకోలే

“కోకో సిటీ ఏర్పాటుపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. భూసేకరణ, లాజిస్టిక్స్, రైతులకు చేకూరే ప్రయోజనం అన్నీ బేరీజు వేసుకుంటున్నాం. త్వరలోనే సీఎం స్థాయిలో సమీక్ష జరిపి నిర్ణయం ప్రకటిస్తాం” అని రాష్ట్ర ఉద్యానవన శాఖ డైరెక్టర్ ఒకరు తెలిపారు. కోకో సాగుతో జిల్లా రైతుల బతుకులు మారతాయని ఆశపడ్డ వేళ, ప్రాజెక్టు తరలింపు వార్తలు వారిని కలవరపెడుతున్నాయి. ఇప్పుడు అందరి చూపు సీఎం చంద్రబాబు వైపే ఉంది. ఏలూరు జిల్లాకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారా? లేక రైతుల ఆశలపై నీళ్లు చల్లుతారా? అన్నది త్వరలో తేలనుంది.
ALSO READ : 82.22 Crore Jaladhara : బీడు భూముల్లో జలధార Andhra Prabha Top Story
