సైకిల్‌పై కలెక్టరేట్‌కు ఎమ్మెల్యే..
సైకిల్‌పై కలెక్టరేట్‌కు ఎమ్మెల్యే..
పర్యావరణ పరిరక్షణకు చింతమనేని సందేశం
ఏలూరు బ్యూరో, ఆంధ్రప్రభ: అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆచరణలో పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని చాటుతూ అందరికీ ఆదర్శంగా నిలిచారు. పర్యావరణ పరిరక్షణ కేవలం మాటలకే పరిమితం కాకుండా చేతల్లో చూపించాలని ఆయన నిరూపించారు.
ఏలూరులోని కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో జిల్లా ఇన్చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జిల్లా పరిషత్ అతిథి గృహం నుంచి కలెక్టరేట్ వరకు స్వయంగా సైకిల్ తొక్కుకుంటూ వెళ్లారు. దీంతో ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

నెల రోజులుగా విలాసవంతమైన కారుకు దూరంగా…
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఇంధన పొదుపు పిలుపును స్ఫూర్తిగా తీసుకున్న చింతమనేని ప్రభాకర్, గత నెల రోజులుగా తాను ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్న విలాసవంతమైన కారును పక్కన పెట్టారు. నియోజకవర్గ పర్యటనలకు సిబ్బంది ఉపయోగించే సాధారణ వాహనంలోనే ప్రయాణిస్తూ ఇంధన పొదుపుపై తన నిబద్ధతను చాటుతున్నారు.

దేశ ఆర్థిక భద్రతకు ఇంధన పొదుపే మార్గం
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అంతర్జాతీయంగా పెరుగుతున్న ఇంధన దిగుమతులను తగ్గించడం ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు. ఇంధన పొదుపును ప్రతి ఒక్కరూ జీవనశైలిలో భాగం చేసుకోవాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ కోసం ప్రతి వ్యక్తి తన వంతు బాధ్యత నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజున బాధ్యతాయుత ప్రజాప్రతినిధిగా సైకిల్‌పై ప్రయాణించి ఆయన ఇచ్చిన సందేశం నియోజకవర్గంతో పాటు జిల్లా వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది.
