ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం
గుర్రంపేటలో ప్రజా దర్బార్ కార్యక్రమం..
ప్రజల నుంచి నేరుగా దరఖాస్తులు స్వీకరణ..
10 రోజుల్లో వినతులకు పరిష్కారం..
దర్బార్‌లో మంత్రి సీతక్క హామీ
భూపాలపల్లి రూరల్, ఆంధ్రప్రభ : భూపాలపల్లి మండలం గుర్రంపేట గ్రామంలో ప్రజా పాలనా ప్రగతి ప్రణాళిక-99 రోజుల కార్యక్రమంలో భాగంగా గుర్రంపేట, పెద్దపూర్, సబ్భక్కపల్లి, లంబాడితండా, బావుసింగ్‌పల్లి గ్రామాల క్లస్టర్‌కు సంబంధించిన ప్రజా దర్బార్ శనివారం నిర్వహించారు. ఎంపీడీఓ నవీన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రజల నుంచి నేరుగా దరఖాస్తులను స్వీకరించి సంబంధిత శాఖ అధికారులకు అందించారు.

అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ప్రజల సమస్యల పరిష్కారమే ప్రజా దర్బార్ లక్ష్యమని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు, రేషన్ కార్డులు, భూ భారతి తదితర అంశాలపై ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. దర్బార్‌లో అందిన వినతులను 10 రోజుల్లో పరిశీలించి అర్హులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మహిళా సంఘాలకు ప్రభుత్వం వడ్డీలేని రుణాలు అందిస్తోందని, మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు.
మహిళా సంఘాల ద్వారా వ్యాపారాలు, సోలార్ యూనిట్లు, సూక్ష్మ పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రోత్సాహం అందిస్తున్నట్లు చెప్పారు. మహిళలు అక్షరాస్యత సాధించి ఆర్థికంగా ఎదగాలని పిలుపునిచ్చారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి ఇల్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. గతంలో ఇల్లు రాని వారు, అసంపూర్తిగా ఉన్న ఇళ్ల యజమానుల దరఖాస్తులను కూడా పరిశీలిస్తామని తెలిపారు. ఒంటరి మహిళలు, వృద్ధులు, అర్హులైన పేదలకు పెన్షన్ల మంజూరులో ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు.
గ్రామాల్లో సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, తండాలకు రహదారి సౌకర్యాల కల్పనపై చర్యలు తీసుకుంటామని, ప్రజా దర్బార్‌లో వచ్చిన ప్రతి సమస్యను సంబంధిత అధికారులతో సమీక్షించి పరిష్కరిస్తామని మంత్రి సీతక్క తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ శర్మ,, డిఎఫ్ఓ నవీన్ రెడ్డి, ఐటీడిఓ పివో లెనిన్, అడిషనల్ కలెక్టర్ లు అశోక్ కుమార్, విజయలక్ష్మి తో పాటు జిల్లా వివిధ శాఖ ల అధికారులు, మార్కెట్ కమిటీ చైర్మన్ రేఖ కళ్యాణ్, రాష్ట్ర పంచాయతీ డైరెక్టర్ భగవాన్ రెడ్డి, ఐదు గ్రామాల సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు..
