Weight Loss | మందులు లేకుండానే 132 కేజీల నుంచి 62 కేజీలకు..
Weight Loss | మందులు లేకుండానే 132 కేజీల నుంచి 62 కేజీలకు..
Weight Loss | ఆంధ్రప్రభ, వెబ్డెస్క్ : అధిక బరువుతో ఇబ్బందులు పడుతున్న నిర్మల్ జిల్లా యువకుడు ఎస్.గంగాప్రసాద్ తన ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణతో అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. కేవలం ఏడాది వ్యవధిలోనే 132 కిలోల బరువు నుంచి 62 కిలోలకు చేరుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఎలాంటి మందులు, శస్త్రచికిత్సలు, ఆసుపత్రి చికిత్సలు లేకుండానే సహజ పద్ధతులతో ఈ ఫలితం సాధించడం విశేషం.
నిర్మల్ జిల్లా భైంసా మండలం వాలెగామ్ గ్రామానికి చెందిన గంగాప్రసాద్ బరువు తగ్గాలనే లక్ష్యంతో అన్నం పూర్తిగా మానేశాడు. దాని స్థానంలో జొన్న రొట్టెలు, గ్రీన్ టీ తృణధాన్యాలతో తయారుచేసిన ఆహారాన్ని తీసుకోవడం ప్రారంభించాడు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లే తన విజయానికి ప్రధాన కారణమని చెబుతున్నాడు.
ప్రతిరోజూ 8 లీటర్ల నీరు తాగడం, 8 గంటలపాటు నిద్రపోవడం, క్రమం తప్పకుండా నడవడం ద్వారా బరువును నియంత్రించగలిగానని గంగాప్రసాద్ తెలిపారు. ప్రకృతి సిద్ధమైన జీవనశైలిని అలవాటు చేసుకోవడం వల్ల ఆరోగ్యం కూడా మెరుగుపడిందన్నారు.
మందులు, ప్రత్యేక చికిత్సలపై ఆధారపడకుండా సంకల్పం, క్రమశిక్షణతో 70 కిలోల బరువు తగ్గిన గంగాప్రసాద్ కథ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అధిక బరువుతో బాధపడుతున్న వారికి ఆయన విజయం స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.
