పుదుచ్చేరిలో ఎన్డీఏ ఘన విజయం

పుదుచ్చేరిలో ఎన్డీఏ ఘన విజయం

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి మచ్చలేని నాయకుడుగా పేరు తెచ్చుకున్నారు. తెల్లటి పంచె, పొడవాటి చొక్కాతో కనిపించే ఆయన అత్యంత సామాన్య జీవనశైలిను అనుసరిస్తారు. మోటార్‌సైకిల్‌పై తిరుగుతూ, వీధి పక్కన టీ తాగుతూ, స్థానికులతో కలిసిపోతుంటారు. ఇప్పటికే నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన, ఐదోసారి విజయం సాధించి మళ్లీ బాధ్యతలు స్వీకరించనున్నారు.


ప్రజల మనిషి..

యానాంలో ఎన్నార్ కాంగ్రెస్ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. ఆయన తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్‌పై 4,568 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఎన్నికల్లో మల్లాడికి 19,863 ఓట్లు, అశోక్కు 15,295 ఓట్లు వచ్చాయి.

ఎన్నికల ప్రచారంలో రంగస్వామి తనదైన ముద్ర వేశారు. స్వయంగా కరపత్రాలు పంచుతూ ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహించారు. అవివాహితుడు, న్యాయశాస్త్ర పట్టభద్రుడైన రంగస్వామి తట్టంచావడి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీలో తిరుగులేని నాయకుడుగా ఉన్న ఆయన, పార్టీ పెద్దలతో వచ్చిన విభేదాల కారణంగా 2011లో ‘ఎన్నార్ కాంగ్రెస్’ పేరుతో సొంత పార్టీని స్థాపించారు. ప్రజలు ఆయనను “జీవించి ఉన్న కామరాజర్”గా, “మక్కలిన్ ముత్తల్వార్” (ప్రజల ముఖ్యమంత్రి)గా ఆప్యాయంగా పిలుచుకుంటారు.

2001లో తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన, 2006లో రెండోసారి, 2011లో మూడోసారి, 2021లో నాలుగోసారి ముఖ్యమంత్రిగా పనిచేశారు.


యానాం: పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి నాయకత్వంలోని ఎన్నార్ కాంగ్రెస్ కూటమి అధికారాన్ని నిలుపుకుంది. 30 స్థానాలు ఉన్న అసెంబ్లీలో ఈ కూటమి 18 స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్ కూటమికి 6 స్థానాలు, నటుడు విజయ్ పార్టీ టీవీకేకు 3 స్థానాలు, ఇతరులు 3 స్థానాల్లో విజయం సాధించారు. ఎగ్జిట్ పోల్ అంచనాలకు అనుగుణంగా ఫలితాలు వెలువడ్డాయి.

ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి తట్టంచావడి నియోజకవర్గం నుంచి గెలుపొందారు. యానాం నియోజకవర్గంలో కూడా ఎన్నార్ కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. ఎన్నార్ కాంగ్రెస్ కూటమిలో బీజేపీ భాగస్వామిగా ఉంది. రాజభవన్ నియోజకవర్గంలో డీఎంకే అభ్యర్థి విగ్నేష్ కన్నన్, బీజేపీ అభ్యర్థి వీపీ రామలింగంపై కేవలం 287 ఓట్ల తేడాతో గెలిచారు. కన్నన్‌కు 7,304 ఓట్లు రాగా, రామలింగానికి 7,017 ఓట్లు వచ్చాయి.

సీనియర్ బీజేపీ నాయకుడు ఎ. నామశివాయం మన్నడిపేట నియోజకవర్గంలో తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి టీపీఆర్ సెల్వంపై విజయం సాధించారు. పుదుచ్చేరి శాసనసభ మాజీ స్పీకర్ వి.పి. శివకోళుందు లాస్పేట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఎం. వైతాయానాథన్‌పై గెలిచారు. విల్లియనూర్ నియోజకవర్గంలో ఎన్నార్ కాంగ్రెస్ అభ్యర్థి బి. రవికుమార్, డీఎంకే రాష్ట్ర కార్యదర్శి ఆర్. శివపై విజయం సాధించారు. ఉప్పళం నియోజకవర్గంలో ఏఐఏడీఎంకే నేత ఎ. అన్బళగన్ గెలుపొందారు. ఆయన డీఎంకే సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కెన్నెడీని ఓడించారు.