Award | పర్యావరణ పరిరక్షణలో గుంటూరు..

Award | పర్యావరణ పరిరక్షణలో గుంటూరు..

Award | గుంటూరు కార్పొరేషన్ / ఆంధ్రప్రభ: గుంటూరు నగరానికి మరొక అరుదైన గౌరవం దక్కింది. మహిళా సాధికారత, పర్యావరణ పరిరక్షణలో గుంటూరు నగరపాలక సంస్థ చేపట్టిన వినూత్న చర్యలకు గుర్తింపుగా యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ ప్రతిష్టాత్మక జెండర్ ఈక్వాలిటీ మొబిలైజేషన్ అవార్డును ప్రకటించింది. విజయవాడలో జరిగిన ‘సస్టైనబుల్ సిటీస్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ పైలట్ ప్రాజెక్ట్ ముగింపు వర్క్‌షాప్‌లో, స్వచ్ఛ భారత్ మిషన్ డైరెక్టర్ సురభి మాలిక్ చేతుల మీదుగా గుంటూరు నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ ఈ అవార్డును స్వీకరించారు.

ఎందుకు ఈ గౌరవం…
ప్రపంచవ్యాప్త పర్యావరణ సవాళ్లను ఎదుర్కొనేందుకు గ్లోబల్ ఎన్విరాన్‌మెంట్ ఫెసిలిటీ చేపట్టిన ప్రాజెక్టులో గుంటూరు నగరం తనదైన ముద్ర వేయడం, పారిశుధ్య నిర్వహణలో మహిళలకు పెద్దపీట వేయడం, కాలుష్య రహిత ఎలక్ట్రికల్ ఆటోల ద్వారా చెత్త సేకరణ చేపట్టి, ‘జీరో ఎమిషన్స్’ లక్ష్యంగా ముందుకు సాగుతుండటం వంటి విశిష్టమైన విధానాలే గుంటూరుకు ఈ అంతర్జాతీయ గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఈ అవార్డు నగరంలోని పారిశుధ్య కార్మికులకు, ముఖ్యంగా అహర్నిశలు శ్రమిస్తున్న మహిళా కార్మికులకు అంకితం చేస్తున్నట్లు నగర కమిషనర్ మయూర్ అశోక్ అన్నారు. ఈ అంతర్జాతీయ గుర్తింపు నగర పరిశుభ్రత పట్ల బాధ్యతను మరింత పెంచింది అని అన్నారు.