Chandrababu | వైఎస్ విగ్ర‌హాన్ని ధ్వంసం చేసింది.. గొడ్డ‌లి పార్టీ వాళ్లే

Chandrababu | వైఎస్ విగ్ర‌హాన్ని ధ్వంసం చేసింది.. గొడ్డ‌లి పార్టీ వాళ్లే

ప్ర‌జ‌లంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌న్న చంద్ర‌బాబు

Chandrababu |చామ‌వ‌రం, ఆంధ్ర‌ప్ర‌భ : రాష్ట్రాభివృద్ధి చూసి.. ఆ పార్టీకి ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోంది. మత విద్వేషాలు సృష్టించేందుకు కుట్ర పన్నుతోంది. వైకాపా అసత్య ప్రచారాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. నంద్యాలలో వైఎస్ విగ్రహంపై దాడి చేసి.. మాపై నెట్టాలని చూశారు. దాడి చేసిందెవరని ఆరా తీస్తే వైకాపా వాళ్లే చేసినట్లు రుజువైంది. విగ్రహం ధ్వంసం చేశారని అబద్ధాలు చెప్పి.. సానుభూతి కోసం ప్రయత్నించారు. దుర్మార్గాలపై యుద్ధం చేస్తూనే.. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం” అని సీఎం చంద్రబాబు అన్నారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో పెన్ష‌న్ డే సంద‌ర్బంగా సోమ‌వారం పర్యటించారు. తుని నియోజకవర్గం, చామవరంలో పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. పెన్షన్ల ద్వారా 62.34 లక్షల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేస్తున్నామని స్పష్టం చేశారు. గతంలో ఒక నెల పెన్షన్ తీసుకోకపోతే రద్దుచేశారని తెలిపారు. పేదవాడి ఇంటికెళ్లి పెన్షన్ ఇస్తే.. ఆ ఆనందమే వేరని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. అందుకే బటన్ నొక్కడానికి ఇష్టపడట్లేదని పేర్కొన్నారు. పేదరికం లేని సమాజం చూడాలనేది తమ ప్రభుత్వ కల అని ఉద్ఘాటించారు.

మ‌హిళ‌ల‌కు 33 శాతం రిజ‌ర్వేష‌న్..
ఒక్కో కుటుంబానికి 4 సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అసెంబ్లీలో మహిళలకు 33 శాతం సీట్లు ఇచ్చి రాజకీయంగా ఎదిగేలా చేస్తామని వ్యాఖ్యానించారు. రైతుల ఉత్పత్తులు ప్రపంచానికి ఎగుమతి చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్యాస్ ధరలు పెరిగినా మహిళలకు ఉచిత సిలిండర్లు సరఫరా చేస్తున్నామని వెల్ల‌డించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలవద్దని తాను, పవన్ కల్యాణ్ కలిశామని ప్రస్తావించారు. మూడు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్లామని.. మూడు పార్టీలు కలిసింది ఈ జూన్‌లోనే అని చెప్పారు.

తునికో ప్ర‌త్యేక‌త‌…
జూన్‌ నెలకో ప్రత్యేకత ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. తుని తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని తెలిపారు. దుర్మార్గులతో యుద్ధం చేయాల్సి వస్తోందని అన్నారు. కత్తులు, కటారాలు తీసుకొచ్చినా ఫర్వాలేదు.. ఇక్కడ తాను ఉన్నానని తెలిపారు. రాష్ట్రాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని వ్యాఖ్యానించారు. నంద్యాలలో మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని వైసీపీ నేతలే ధ్వంసం చేశారని ధ్వజమెత్తారు. ఆ నెపాన్ని టీడీపీపై నెట్టాలని చూశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఒక నెల పింఛ‌న్ తీసుకోక‌పోతే ..
గతంలో ఒక నెల పింఛను తీసుకోకపోతే వెంటనే రద్దు చేసేవారని.. కానీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3 నెలల వరకు ఇస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో కుటుంబానికి దాదాపు 3,4 సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు.

సంక్షేమం, అభివృద్ధి రెండు క‌ళ్లు..
“రాష్ట్ర రైతుల ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసేలా చర్యలు చేపడుతున్నాం. గ్యాస్ ధరలు పెరిగినా మహిళలకు ఉచితంగా 3 సిలిండర్లు ఇస్తున్నాం. నేరుగా పేదవాడి ఇంటికొచ్చి పింఛను ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది. కేవలం ఈరోజు బాగుంటే చాలు అని భావించొద్దు. భవిష్యత్ కూడా బాగుండాలని ఎన్నో ప్రణాళికలు చేపట్టాం. రాష్ట్రానికి రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాం. పరిశ్రమలు వస్తే.. మనవాళ్లు ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. విశాఖలో గూగుల్ సంస్థ రూ.15 లక్షల కోట్ల పెట్టుబడులు పెడుతోంది. రాష్ట్ర యువత నైపుణ్యాలు పెంచుకొని ఉద్యోగాలు అందిపుచ్చుకోవాలి. రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్ మార్చే బాధ్యత మాది. గతేడాది యోగాంధ్ర బాగా చేశాం. ఈసారి అమరావతి కేంద్రంగా యోగా కార్యక్రమాలు చేపడతాం. రోజుకు అరగంట వ్యాయామం చేస్తే అనారోగ్యాలు రావు. అందరి జీవన ప్రమాణాలు పెరగాలనేది మా కల. పింఛన్లు ఇంటింటికే వచ్చి అందిస్తున్నాం. కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేదు. ఏ సమస్యకైనా ఆన్లైన్లోనే పరిష్కారం చూపుతున్నాం. పీ4 కార్యక్రమం కింద పేదలను ఆదుకుంటున్నాం. రాష్ట్రాభివృద్ధి కోసం పవన్, నేను కలిసి పని చేస్తున్నాం. డీఎస్సీ నిర్వహించి పోస్టులు భర్తీ చేస్తే వైకాపా ఓర్వలేకపోతోంది అని అన్నారు..

ప్ర‌జ‌ల‌తో మాటా మంతి…
కాగా, ముందుగా చామవరం చేరుకున్న ఆయ‌న ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారంపై అధికారులతో చర్చించారు. మధ్యాహ్నం లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందజేశారు. తరువాత తుని నియోజకవర్గ టీడీపీ శ్రేణులతో చంద్రబాబు సమావేశం అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధత, కూటమి బలోపేతం, స్థానిక పరిస్థితులపై నాయకులు, కార్యకర్తలతో సీఎం చంద్రబాబు చర్చించారు. ప్రస్తుతం ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజావేదిక సభ వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వైద్యశిబిరాలు కూడా అందుబాటులో ఉంచారు. సీఎం పర్యటన ఏర్పాట్లను కాకినాడ జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్‌, ఎస్పీ బిందు మాధవ్‌, ఇతర అధికారులు పర్య‌వేక్షించారు.

CLICK HERE TO READ అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలి

CLICK HERE TO READ MORE