ఇంధన పొదుపుపై ప్రత్యేక సందేశం
శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ: ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కనీసం ఒకరోజైనా ఇంధన వినియోగాన్ని తగ్గించాలని జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ పిలుపునిచ్చారు.
ఇంధన పొదుపుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సోమవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కలెక్టర్ శ్యాంప్రసాద్ ఈ-బైక్‌పై ప్రయాణించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల స్వీకరణ (గ్రీవెన్స్) కార్యక్రమానికి కూడా ఆయన ఈ-బైక్‌పైనే హాజరయ్యారు.
అనంతరం పుట్టపర్తి ఎనుములపల్లిలోని తహసీల్దార్ కార్యాలయం సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆధార్ సేవా కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఈ-బైక్‌పై చేరుకుని, ప్రజలకు ఇంధన పొదుపు అవసరాన్ని వివరించారు.
కార్యక్రమం అనంతరం మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డితో కలిసి ఈ-బైక్‌పై తిరిగి శ్రీ సత్యసాయి కలెక్టరేట్‌కు చేరుకున్నారు. ఇంధన వినియోగాన్ని తగ్గించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు.
సాంప్రదాయ ఇంధన వాహనాలకు ప్రత్యామ్నాయంగా విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించవచ్చని కలెక్టర్ శ్యాంప్రసాద్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ, ఇంధన పొదుపు అనేది కేవలం ఆర్థిక ప్రయోజనాలకే కాకుండా పర్యావరణ పరిరక్షణకు కూడా కీలకమని అన్నారు. ప్రజలు వీలైనంత వరకు ప్రజా రవాణా, సైకిళ్లు, విద్యుత్ వాహనాలను వినియోగిస్తూ ఇంధన వినియోగాన్ని తగ్గించాలని సూచించారు.
ఈ కార్యక్రమం ప్రజల్లో ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణపై మరింత చైతన్యం కలిగిస్తోందని అధికారులు తెలిపారు.
