ఇప్పటికైనా వినుకొండ అభివృద్ధిపై దృష్టి పెట్టాలి

మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు
చేపల చెరువుల్లోని నీరు బయటకు పెడితే భూగర్భ జలాలు అడుగంటే ప్రమాదం
చేపల చెరువులపై సోమవారం జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తాం
అనుమతులు లేకుండా విచ్చలవిడిగా వెంచర్లు

వినుకొండ, ఆంధ్రప్రభ : కూటమి నాయకులు తన మీద దృష్టి పెట్టడం మానేసి ఇకనైనా అభివృద్ధిపై దృష్టి పెట్టాలని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గ పరిధిలోని పెదకంచెర్ల, నడిగడ్డ, కొప్పుకొండ, ఉప్పరపాలెం, ముక్కెళ్ళపాడు తదితర గ్రామాల్లోని చేపల చెరువుల్లో నీరు బయటకు వెళ్ళబెట్టడం వల్ల భూగర్భ జలాలు ఆయా గ్రామాల్లో అడుగంటే పరిస్థితి ఉందన్నారు. చెరువుల నుంచి నీళ్లు బయటకు వెల్ల పెట్టకుండా చేపలను వలలు వేసి పట్టుకోవాలని దీనిపై సోమవారం జిల్లా కలెక్టర్ ను కలిసి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుందన్నారు.

పెదకంచెర్ల చెరువు 700 ఎకరాల విస్తీర్ణంలో ఉందని ఆ చెరువులోని నీరు బయటకు పోతే చుట్టుపక్కల గ్రామాలు ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి ఉందన్నారు. నాగార్జునసాగర్ లో ప్రభుత్వం తరఫున 40 లక్షల చేప పిల్లలను వేయాల్సి ఉండగా అందులో 20 లక్షల పిల్లలను మాత్రమే సాగర్ లో వేశారని మిగిలిన 20 లక్షల చేప పిల్లలను మక్కిన మల్లికార్జునరావు సొంత చెరువుల్లో వేసుకున్నారని దీనిపై విచారణ జరగగా ఒక అధికారి కూడా సస్పెండ్ అయినట్లు ఆయన ఆరోపించారు. వినుకొండ ప్రాంతంలో తనకున్న భూములపై ప్రభుత్వం ఎప్పుడైనా సర్వే చేయించుకోవచ్చని అందులో ప్రభుత్వ భూములు ఉంటే స్వాధీనం చేసుకోవడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.

జాలలపాలెం వద్ద 150 ఎకరాల తో పాటు మరో 25 ఎకరాలు అటవీ భూములను ఆక్రమించుకొని వెంచర్లు వేశారని ఎకరం 10 లక్షలకు కొనుగోలు చేసి ఎర్రచందనం మొక్కల పేరుతో 80 లక్షలకు అమ్ముకుంటు న్నారని అందులో ప్రభుత్వ భూములు ఉన్న, వేసిన ప్లాట్లకు ఎలాంటి అనుమతులు లేకున్నా అధికారులు పట్టించు కోవడంలేదని ఆరోపించారు. వేల్పూరు నుంచి వినుకొండకు వచ్చే మార్గమధ్యంలో కొందరు నన్ను అనుసరించి ఇబ్బంది పెట్టాలని చూసారని, వినుకొండ పట్టణంలో ఎటువంటి ర్యాలీ చేయనప్పటికీ 79 మంది వైసిపి నాయకులు, కార్యకర్తలపై పోలీసులు అక్రమం గా కేసులు బనాయించారని తెలిపారు.

వినుకొండ పట్టణంలో ఇల్లీగల్ గా స్పా సెంటర్లు నడుస్తున్న పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పట్టణంకు బయట ప్రధాన రహదారులపై అసాంఘిక కార్యకలాపాలు జరగడం దురదృష్ట కరమన్నారు. పలు గ్రామాల్లో విచ్చలవిడిగా మట్టిని కొల్లగొట్టి పట్టణంలోని వెంచర్లకు తరలిస్తున్నారని రెవెన్యూ, మైనింగ్ అధికారులు ఎందుకు మౌనంగా ఉంటున్నారో సమాధానం చెప్పాలన్నారు. ఆయనతోపాటు సమావేశంలో పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు.