రికార్డు స్థాయిలో 659 మంది బాధితులకు రూ.5.74 కోట్ల సీఎంఆర్‌ఎఫ్‌ సాయం

రికార్డు స్థాయిలో 659 మంది బాధితులకు రూ.5.74 కోట్ల సీఎంఆర్‌ఎఫ్‌ సాయం

34 మంది బాధితులకు రూ.12.24 లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే బడేటి చంటి

ఏలూరు బ్యూరో – ఆంధ్రప్రభ : అత్యవసర వైద్య సహాయం అవసరమైన వారికి ఆర్థిక భరోసా కల్పించడంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్‌) ఎంతో దోహదపడుతోందని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు. ఇప్పటివరకు నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు రూ.5 కోట్ల 74 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు, ఎల్‌వోసిలను బాధితులకు అందించి ఆదుకున్నట్లు ఆయన వెల్లడించారు.

ఏలూరు పవర్‌పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఆర్టీసీ విజయవాడ జోన్-2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడుతో కలిసి ఎమ్మెల్యే బడేటి చంటి సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు, ఎల్‌వోసి కాపీలను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో 34 మంది బాధితులకు మంజూరైన రూ.12,24,103 విలువైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను వారి కుటుంబ సభ్యులు, బంధువులకు అందజేశారు. అలాగే అత్యవసర వైద్య సహాయం అవసరమైన వారికి రూ.24,23,026 విలువైన 11 ఎల్‌వోసి కాపీలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్ల వ్యవధిలో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో 659 మంది బాధితులకు రూ.5,74,46,828 ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. ప్రజారోగ్య పరిరక్షణకు ప్రభుత్వం చూపుతున్న నిబద్ధతకు ఇదే నిదర్శనమని అన్నారు.

ప్రజల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా ప్రతి గురువారం ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని, వేసవిని దృష్టిలో ఉంచుకుని చలివేంద్రాలతో పాటు పలు సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టినట్లు వెల్లడించారు.

సామాజిక మాధ్యమాల్లో కూటమి ప్రభుత్వంపై జరుగుతున్న దుష్ప్రచారాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించిన ఆయన, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ఆర్టీసీ విజయవాడ జోన్-2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ, ఎమ్మెల్యే బడేటి చంటి చొరవతోనే నియోజకవర్గానికి అత్యధికంగా ముఖ్యమంత్రి సహాయ నిధులు మంజూరయ్యాయని, తద్వారా బాధిత కుటుంబాలకు ఎంతో బాసట లభించిందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎఎంసి చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, టీడీపీ నగర అధ్యక్షుడు చోడే వెంకటరత్నం, కార్యదర్శి రెడ్డి నాగరాజు, తెలుగుదేశం పార్టీ ఏలూరు నియోజకవర్గ పరిశీలకుడు షేక్ మీరా వల్లీ, పలువురు కార్పొరేటర్లు, క్లస్టర్ ఇన్‌చార్జిలు, డివిజన్ ఇన్‌చార్జిలు పాల్గొన్నారు.

ఫోటో రైటప్ : 34 మంది బాధితులకు మంజూరైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను పంపిణీ చేస్తున్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి.