పేదల పాలిట కల్పతరువుగా సీఎం సహాయ నిధి పథకం

పేదల పాలిట కల్పతరువుగా సీఎం సహాయ నిధి పథకం

నంద్యాల బ్యూరో – ఆంధ్రప్రభ : రాష్ట్రంలో అమలవుతున్న అనేక సంక్షేమ పథకాలలో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్‌) పథకం పేదలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటోందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. వైద్య ఖర్చులు భరించలేక ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు ఈ పథకం గొప్ప భరోసా కల్పిస్తోందని ఆయన అన్నారు.

ఆదివారం నంద్యాల జిల్లా బనగానిపల్లె నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద దాదాపు రూ.14 లక్షల విలువైన చెక్కులను 28 మంది లబ్ధిదారులకు మంత్రి అందజేశారు.

చెక్కుల పంపిణీ అనంతరం వైద్య సహాయం పొందిన రోగుల ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి, వారి యోగక్షేమాలను మంత్రి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. దీంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. అలాగే కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రజల అభిప్రాయాలను కూడా తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పేదల పాలిట ముఖ్యమంత్రి సహాయ నిధి కల్పతరువుగా నిలుస్తోందన్నారు. రాష్ట్రంలో ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నిరుపేదలను ఆదుకుంటున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవ వల్లే రాష్ట్రంలో సీఎంఆర్‌ఎఫ్‌ను సమర్థవంతంగా అమలు చేయగలుగుతున్నామని పేర్కొన్నారు.

కులం, మతం, ప్రాంతం, పార్టీతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ సీఎంఆర్‌ఎఫ్‌ అందజేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. నిరుపేదల ఆరోగ్య రక్షణకు కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కొండంత అండగా నిలుస్తోందన్నారు. పేదలకు కనీవినీ ఎరుగని రీతిలో వైద్య సహాయం అందుతోందని చెప్పారు.

కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.