ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రాజకీయ రగడ..

చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ : చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ నాయుడు ఇటీవల చేసిన “బెంగళూరు, చెన్నై నగరాలను చిత్తూరు వాళ్లే ఏలుతున్నారు” అనే వ్యాఖ్యలతో ప్రారంభమైన వివాదం రెండు రాష్ట్రాల్లో రాజకీయ చర్చకు దారితీసింది. చివరకు కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో సత్య ప్రమాణం వరకు వెళ్లింది. కన్నడ సంఘాల నిరసనలు, కర్ణాటకలో నమోదైన ఫిర్యాదు, ఎమ్మెల్యే ఇచ్చిన వివరణ, క్షమాపణలు, అనంతరం టీడీపీ–వైసీపీ నేతల మధ్య సవాళ్లు, కాణిపాకంలో చోటుచేసుకున్న రాజకీయ హైడ్రామా జిల్లాలో తీవ్ర ఉత్కంఠకు కారణమయ్యాయి.

ఇటీవల నిర్వహించిన ఓ సభలో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ నాయుడు చిత్తూరు ప్రజల ప్రతిభను ప్రస్తావిస్తూ “బెంగళూరు సగాన్ని, చెన్నైని చిత్తూరు వాళ్లే ఏలుతున్నారు” అని వ్యాఖ్యానించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో కర్ణాటకలోని కన్నడ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. కన్నడ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయని ఆరోపిస్తూ బెంగళూరులోని వైట్‌ఫీల్డ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై పెద్దఎత్తున నిరసనలు కూడా జరిగాయి.

వివాదం ముదరడంతో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ నాయుడు మీడియా సమావేశం నిర్వహించి వివరణ ఇచ్చారు. తాను ఎవరినీ, ఏ భాషను, ఏ ప్రాంతాన్ని కించపరిచే ఉద్దేశంతో మాట్లాడలేదని స్పష్టం చేశారు. చిత్తూరు ప్రజలు దేశవ్యాప్తంగా వ్యాపారాలు, ఉద్యోగాలు, వివిధ రంగాల్లో ఉన్నత స్థానాలకు చేరుకున్నారనే ఉద్దేశంతో మాత్రమే ఆ వ్యాఖ్యలు చేశానని తెలిపారు. తన మాటలను రాజకీయ ప్రత్యర్థులు కావాలనే వక్రీకరించి ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

తాను కూడా బెంగళూరులో జీవించి, అక్కడి ప్రజల ఆదరణ పొందిన వ్యక్తినని, కన్నడ ప్రజలపై తనకు ఎంతో గౌరవం ఉందని చెప్పారు. తన వ్యాఖ్యల వల్ల ఏ ఒక్క కన్నడిగుడైనా మనస్తాపానికి గురై ఉంటే హృదయపూర్వకంగా క్షమాపణలు చెబుతున్నానని ప్రకటించారు. అవసరమైతే బెంగళూరుకు వెళ్లి అక్కడే మరోసారి వివరణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. తనపై ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదని, కేవలం ఫిర్యాదు స్వీకరించిన అక్‌నాలెడ్జ్‌మెంట్ మాత్రమే ఇచ్చారని కూడా స్పష్టం చేశారు.

ఎమ్మెల్యే క్షమాపణలతో వివాదం ముగిసిందని భావిస్తున్న సమయంలో చిత్తూరు టౌన్ బ్యాంకు మాజీ చైర్మన్ షణ్ముగం విలేకరుల సమావేశం నిర్వహించి, ఎమ్మెల్యే వ్యాఖ్యలను వైసీపీ నేతలు కావాలనే వక్రీకరించి కన్నడ సంఘాలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే ఎప్పుడూ కన్నడ లేదా తమిళ ప్రజలను కించపరిచేలా మాట్లాడలేదని పేర్కొంటూ, నిజానిజాలు తేల్చుకోవడానికి కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో సత్య ప్రమాణానికి రావాలని వైసీపీ నాయకులకు బహిరంగ సవాల్ విసిరారు.

సవాల్‌ను స్వీకరించిన వైసీపీ నాయకులు కూడా శుక్రవారం సాయంత్రం కాణిపాకం చేరుకున్నారు. నిర్ణయించిన సమయానికి టీడీపీ, వైసీపీ నాయకులు ఒకేసారి ఆలయ పుష్కరిణి వద్దకు చేరుకుని సత్య ప్రమాణానికి సిద్ధమయ్యారు. ఇరు వర్గాలు ఒకేసారి కోనేరులోకి దిగడంతో పరస్పరం వాగ్వాదానికి దిగాయి. కొద్దిసేపు తోపులాటకు దారితీసే పరిస్థితి నెలకొనడంతో ఆలయ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. చిత్తూరు వెస్ట్ సీఐ శ్రీధర్ నాయుడు ఆధ్వర్యంలో కాణిపాకం ఎస్‌ఐ నరసింహులు, తవణంపల్లి ఎస్‌ఐ రమేష్, గుడిపల్లి ఎస్‌ఐతో పాటు భారీ సంఖ్యలో పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను విడదీశారు. ఆలయ పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరిస్థితిని అదుపులో ఉంచారు.

టీడీపీ తరఫున మాజీ టౌన్ బ్యాంకు చైర్మన్ షణ్ముగం పుష్కరిణిలో స్నానం చేసి, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ నాయుడు కన్నడ ప్రజలను కించపరిచేలా మాట్లాడలేదని, వైసీపీ నేతలే రాజకీయ ప్రయోజనాల కోసం కన్నడ సంఘాలను రెచ్చగొడుతున్నారని దేవుడి సాక్షిగా సత్య ప్రమాణం చేశారు.

మరోవైపు వైసీపీ తరఫున బీసీ నాయకుడు జ్ఞాన జగదీష్ తమ పార్టీకి కర్ణాటకలో జరుగుతున్న పరిణామాలతో ఎలాంటి సంబంధం లేదని, ఈ వ్యవహారాన్ని రాజకీయంగా తమపై మోపడం సరికాదని సత్య ప్రమాణం చేశారు.

సత్య ప్రమాణం అనంతరం కూడా ఆలయ సమీపంలో ఇరు వర్గాలు నినాదాలు చేసుకుంటూ మరోసారి ఎదురెదురుగా రావడంతో ఉద్రిక్తత నెలకొంది. అయితే పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఇరు వర్గాలు సత్య ప్రమాణాలు పూర్తి చేసి వెళ్లిపోయే వరకు పోలీసులు అక్కడే బందోబస్తు నిర్వహించారు.

చిత్తూరు ఎమ్మెల్యే వ్యాఖ్యలతో మొదలైన ఈ వివాదం క్షమాపణలు, రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు దాటి చివరకు కాణిపాకం ఆలయంలో సత్య ప్రమాణం వరకు చేరడం జిల్లాలో సంచలనంగా మారింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పరిస్థితిని సమర్థవంతంగా నియంత్రించడంతో కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది. అయితే ఈ వ్యవహారం రాజకీయంగా మాత్రం ఇంకా చర్చనీయాంశంగానే కొనసాగుతోంది.