కాంట్రాక్టర్ల సమస్యలపై గళమెత్తిన కాంట్రాక్టర్లు…

కాంట్రాక్టర్ల సమస్యలపై గళమెత్తిన కాంట్రాక్టర్లు…
పెండింగ్ బిల్లుల క్లియరెన్స్‌కు డెడ్‌లైన్ విధించాలి
ప్యాకేజీ టెండర్లకు వ్యతిరేకంగా తీర్మానం
ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న కాంట్రాక్ట్ బిల్లులు అన్నింటిని తక్షణమే విడుదల చేయాలని కాంట్రాక్టర్లు డిమాండ్ చేశారు. విజయవాడలోని హోటల్ ఇంద్రప్రస్థ వేదికగా ఆదివారం స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ (సబ్కా) ఉమ్మడి కృష్ణ జిల్లా జనరల్ బాడీ సమావేశం జరిగింది. రాష్ట్ర కమిటీ పర్యవేక్షణలో జరిగిన ఈ సమావేశంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎంపిక చేయడంతో పాటు కాంట్రాక్టర్ల సమస్యలపై పలు కీలక తీర్మానాలను ఆమోదించారు.
నూతన కమిటీ అధ్యక్షుడిగా మండవ సాయి బాధ్యతలు స్వీకరించగా, గౌరవ అధ్యక్షుడిగా కలిదిండి కృష్ణంరాజు ఎంపికయ్యారు. ఉపాధ్యక్షులుగా కె. భూపతి రెడ్డి, కె. అమర్‌బాబు, కార్యదర్శిగా ఎల్. రవికిరణ్, కోశాధికారిగా వెంకటేశ్వరరాజు నియమితులయ్యారు. కో-ఆర్డినేటర్‌గా ఆర్. మురళీధరరావు, జాయింట్ సెక్రటరీలుగా వీరంకి శ్రీధర్, తాతినేని వీరబ్రహ్మం బాధ్యతలు చేపట్టారు. సలహాదారులుగా జి. సత్యసుధీర్, ఎం. రత్నారావు, సిహెచ్. కృష్ణదాసు, కె. కోటిరెడ్డి ఎన్నిక కాగా, కమిటీ సభ్యులు, ఎక్స్‌అఫీషియో సభ్యులుగా పలువురిని ఎంపిక చేశారు.
సమావేశంలో ప్రధానంగా ప్రభుత్వ ఆర్థిక విధానాలు, కాంట్రాక్టర్లకు పెండింగ్‌లో ఉన్న బిల్లులపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఉగాది కానుకగా బిల్లుల చెల్లింపులు ప్రారంభించిన ప్రభుత్వానికి సంఘం తరపున ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేశారు. అయితే జలజీవన్ మిషన్ పనులు పూర్తి చేసిన ఎంఎస్ఎంఈ కేటగిరీ కాంట్రాక్టర్ల బిల్లులను తక్షణమే విడుదల చేయాలని అధ్యక్షుడు మండవ సాయి డిమాండ్ చేశారు. మిగిలిన పెండింగ్ బిల్లులన్నింటినీ మార్చి 31లోగా క్లియర్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
పంచాయతీరాజ్ విభాగంలో రూ.2,089 కోట్ల విలువైన 1,388 పనులను కేవలం 28 ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలవడాన్ని అసోసియేషన్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ విధానం స్థానిక కాంట్రాక్టర్లకు అన్యాయం చేస్తుందని పేర్కొంటూ, ప్యాకేజీ టెండర్లను రద్దు చేసి ప్రతి పనిని విడిగా టెండర్ పిలవాలని ఏకగ్రీవంగా తీర్మానించారు.
