మహాకవి జాషువా ఆశయాలు భావితరాలకు మార్గదర్శకం

టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు

విజయవాడ, ఆంధ్రప్రభ : నవయుగ కవి చక్రవర్తి, మహాకవి గుర్రం జాషువా గారి వర్ధంతి సందర్భంగా గొల్లపూడిలోని కార్యాలయంలో టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్థానిక నాయకులతో కలిసి జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. విశ్వమానవ సమానత్వానికి తన కలాన్ని ఆయుధంగా మలిచిన మహాకవి గుర్రం జాషువా తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. కుల వివక్ష, మూఢాచారాలు, సామాజిక అసమానతలను తన పదునైన కవిత్వంతో ప్రశ్నిస్తూ, ‘గబ్బిలం, ‘ఫిరదౌసి’ వంటి అద్భుత రచనల ద్వారా సమాజాన్ని ఆలోచింపజేసిన యుగకర్త జాషువా అని కొనియాడారు.

సమకాలీన కవిత్వంతో తిరుగుబాటు బావుటా ఎగురవేసి, అణగారిన వర్గాల ఆవేదనను ప్రపంచానికి వినిపించిన మహోన్నత కవి జాషువా అని పేర్కొన్నారు. సమానత్వం, మానవత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన సాహిత్య పోరాటం నేటికీ ప్రతి తరానికి స్ఫూర్తినిస్తోందని అన్నారు. “రాజు మరణిస్తే శిలా విగ్రహాలలో ఉంటాడు… కవి మరణిస్తే ప్రజల నాలుకలలో ఉంటాడు” అనే జాషువా గారి అమర వాక్యాలు ఆయన చిరస్థాయి ప్రజాకవిగా నిలిచిన గొప్పతనానికి నిదర్శనమని పేర్కొన్నారు. తెలుగు సాహిత్యానికి, సమాజ సంస్కరణకు ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని, ఆయన ఆశయాలు భావితరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని దేవినేని ఉమా తెలిపారు.