Vijayawada | ఇంద్ర‌కీలాద్రిపై రేపటి నుంచి శాకంబరీ మహోత్సవాలు

▪️ 19వ ఏడాదిలోకి అడుగుపెట్టిన వేడుకలు
▪️ 32 టన్నుల కూరగాయలు, 4 టన్నుల పండ్లతో దుర్గమ్మకు విశేష అలంకారం
▪️ జూలై 27–29 వరకు మూడు రోజులపాటు వైభవంగా ఉత్సవాలు
▪️ ఎల్‌నినో ప్రభావం ఉన్నా ప్రత్యేక బృందాలతో కూరగాయల సేకరణ
▪️ కూరగాయలు వృథా కాకుండా ఆలయం వెలుపల ప్రత్యేక ఏర్పాట్లు
▪️ సిద్ధమైన కాయగూరల దండలు.. శోభాయమానంగా దుర్గమ్మ సన్నిధి
▪️ దర్శన సమయాల్లో ఎలాంటి మార్పులు ఉండవని ఈవో వి.కె. శీనా నాయక్ వెల్లడి

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ: విజయవాడ లోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో అత్యంత వైభవంగా నిర్వహించే శాకంబరీ మహోత్సవాలు సోమవారం (జూలై 27) నుంచి మూడు రోజులపాటు ప్రారంభం కానున్నాయి. 19వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన ఈ ఉత్సవాల నిర్వహణకు దేవస్థానం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ విషయాన్ని దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ వెల్లడించారు.

ప్రకృతి స్వరూపునిగా కనకదుర్గమ్మ..

ప్రకృతి స్వరూపిణి ఐనా అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో అలంకరించడం శాకంబరీ ఉత్సవాల ప్రత్యేకత. సకాలంలో వర్షాలు కురిసి పాడిపంటలు సమృద్ధిగా పండాలని, రైతాంగం సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. 2007లో ప్రారంభమైన ఈ ఉత్సవాలు గత 19 ఏళ్లుగా నిరంతరాయంగా కొనసాగుతున్నాయని ఈవో తెలిపారు. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో మార్కెట్లో కూరగాయల కొరత ఏర్పడినప్పటికీ, దేవస్థానం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి రైతులు, వ్యాపారుల నుంచి విరాళాల రూపంలో కూరగాయలు సేకరించింది. ఇప్పటికే తొలి విడతగా 32 టన్నుల కూరగాయలు, ఆకుకూరలు ఇంద్రకీలాద్రికి చేరుకోగా, విజయవాడ హోల్‌సేల్ పండ్ల మార్కెట్ నుంచి మరో 4 టన్నుల పండ్లు దేవస్థానానికి అందనున్నాయి.

ప్రత్యేక జాగ్రత్తలు..

రైతులు అందించిన కూరగాయలు, పండ్లు వృథా కాకుండా ఆలయం వెలుపల అలంకరణలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఈవో తెలిపారు. ఇప్పటికే కాయగూరల దండలను సిద్ధం చేసి ఆలయ ప్రాంగణాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. మూడు రోజులపాటు జరిగే శాకంబరీ మహోత్సవాల సందర్భంగా భక్తుల దర్శన సమయాల్లో ఎలాంటి మార్పులు ఉండవని, సాధారణ రోజుల మాదిరిగానే దర్శనాలు కొనసాగుతాయని ఈవో వి.కె. శీనా నాయక్ స్పష్టం చేశారు. ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), సభ్యులు, దేవస్థాన సిబ్బంది సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొంటూ, ఈ పవిత్ర ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి అనుగ్రహం పొందాలని కోరారు.