లింగ నిర్ధారణ పరీక్షలపై కలెక్టర్ కఠిన హెచ్చరిక…

లింగ నిర్ధారణ పరీక్షలపై కలెక్టర్ కఠిన హెచ్చరిక…

భీమవరం, ఆంధ్రప్రభ : లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి హెచ్చరించారు.

శనివారం కలెక్టర్ ఛాంబర్‌లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో ఏర్పాటు చేసిన కమిటీ సమావేశంలో గర్భస్థ శిశు లింగ నిర్ధారణ నివారణ చట్టం (PCPNDT) అమలుతీరును సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, స్కానింగ్ కేంద్రాల్లో అక్రమంగా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. లింగ నిర్ధారణ కోసం ప్రయత్నించే గర్భిణీలు, కుటుంబ సభ్యులు కూడా శిక్షార్హులేనని హెచ్చరించారు.

బాలికల సంఖ్య తగ్గిపోకుండా చూడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. స్కానింగ్ కేంద్రాలపై తరచూ తనిఖీలు నిర్వహించి రికార్డులు సమగ్రంగా పరిశీలించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు.

చట్ట అమలులో ఎలాంటి లోపాలు లేకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ప్రధాన కూడళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు, ప్రజా ప్రదేశాల్లో ప్రచార బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు భీమవరం డివిజన్‌లో 27, నరసాపురం డివిజన్‌లో 30 డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించినట్లు తెలిపారు. 2026 ఏప్రిల్, మే నెలల్లో నరసాపురం డివిజన్‌లో 9 డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించినట్లు వెల్లడించారు.

కొత్త స్కానింగ్ సెంటర్ ఏర్పాటు కోసం ఆచంట–కోడేరు రోడ్డులోని ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దరఖాస్తును కమిటీ ఆమోదించినట్లు తెలిపారు. జిల్లాలోని 9 స్కానింగ్ సెంటర్ల రెన్యువల్, 3 సెంటర్ల మార్పులు–చేర్పుల దరఖాస్తులు కూడా ఆమోదించబడ్డాయని వివరించారు.

ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జి. గీతాబాయి, కమిటీ సభ్యులు ఎం.ఎస్.వి.ఎస్. బద్రిరాజు, సీఐ పి. మురళీకృష్ణ, డాక్టర్ ఐ. లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.