సైకిల్‌పై రంగంలోకి దిగిన ఎమ్మెల్యే…
సైకిల్‌పై రంగంలోకి దిగిన ఎమ్మెల్యే…
వెంటనే మారిన నిర్ణయం!
తిరువూరు, ఆంధ్రప్రభ: తిరువూరు నియోజకవర్గ పరిధిలో పారిశుద్ధ్య మెరుగుదలే లక్ష్యంగా చేపట్టిన “ఆపరేషన్ క్లీన్ స్వీప్” కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు శనివారం ముమ్మరంగా నిర్వహించారు. పట్టణంలోని వడ్డెర బజారు, మాలపల్లి, బస్టాండ్ ఔట్‌గేట్, మార్కెట్ ప్రాంతాల్లో ఆయన స్వయంగా పర్యటించి పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు.
ఈ సందర్భంగా స్థానిక డ్రైనేజీ వ్యవస్థలు, పారిశుద్ధ్య పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎమ్మెల్యే, సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
సైకిల్‌పై పర్యటించి సమస్యల అధ్యయనం
ప్రజలకు మరింత చేరువయ్యే ఉద్దేశంతో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పట్టణ వీధుల్లో సైకిల్‌పై పర్యటించారు. స్థానికుల సమస్యలను నేరుగా తెలుసుకుంటూ పలు ప్రాంతాల్లో పరిశీలన నిర్వహించారు.
అనంతరం సర్దార్ బాపయ్య కూరగాయల మార్కెట్ పాత భవనాన్ని సందర్శించారు. పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్న భవన పరిస్థితిని పరిశీలించిన ఆయన, ప్రమాదాలు సంభవించే అవకాశం ఉన్నందున వెంటనే భవనాన్ని కూల్చివేయాలని అధికారులను ఆదేశించారు.
ఆధునిక మార్కెట్ నిర్మాణానికి హామీ
ప్రస్తుతం ఉన్న పాత భవనం స్థానంలో అన్ని సౌకర్యాలతో కూడిన ఆధునిక కూరగాయల మార్కెట్ నిర్మిస్తామని ఎమ్మెల్యే వ్యాపారులకు హామీ ఇచ్చారు. వ్యాపారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మెరుగైన వసతులతో మార్కెట్‌ను అభివృద్ధి చేస్తామని తెలిపారు.
ప్రత్యామ్నాయ స్థలం కోరిన వ్యాపారులు
కొత్త మార్కెట్ నిర్మాణం పూర్తయ్యే వరకు వ్యాపారాలు నిర్వహించేందుకు అనువైన ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించాలని స్థానిక కూరగాయల వ్యాపారులు ఎమ్మెల్యేను కోరారు. బస్టాండ్ ఆవరణలో ఖాళీ స్థలం అందుబాటులో ఉందని వారు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.
దీనిపై స్పందించిన ఎమ్మెల్యే, వ్యాపారులతో కలిసి బస్టాండ్ వద్ద ఉన్న స్థలాన్ని పరిశీలించి, తాత్కాలికంగా అక్కడే వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకునేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
ప్రజల హర్షం
ఈ క్షేత్రస్థాయి పర్యటనలో మున్సిపల్ అధికారులు, పోలీసు సిబ్బంది, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే స్వయంగా ప్రాంతాలను సందర్శించి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టడంపై స్థానిక ప్రజలు, వ్యాపారులు హర్షం వ్యక్తం చేశారు.
