NITI Aayog | ఆకాంక్షిత బ్లాకులో..
NITI Aayog | ఆకాంక్షిత బ్లాకులో..
ఆరు కీలక పురోగతి సూచికల సాధనకు కృషి…
NITI Aayog | ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : ఆకాంక్షిత బ్లాకు కార్యక్రమం కింద నిర్దేశించిన ఆరు కీలక పురోగతి సూచికలు (కేపీఐ) పూర్తిస్థాయిలో సాధించేందుకు మండల అధికారులు కృషి చేస్తున్నారని నీతి ఆయోగ్ అధికారి రాధికా ములే సంతృప్తి వ్యక్తం చేశారు. ఇబ్రహీంపట్నం మండలంలో నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో అమలవుతున్న ఆకాంక్షిత బ్లాక్ కార్యక్రమం (ఏబీపీ) – సంపూర్ణతా అభియాన్ 2.Oలో భాగంగా గురువారం ఆమె పర్యటించారు.
మండలంలోని అంగన్ వాడీ కేంద్రాలు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం, ప్రభుత్వ పాఠశాల, పశు శాఖ కార్యాలయం, రైతు సేవా కేంద్రాలను సందర్శించి అక్కడ అందుతున్న సేవలు, అమలవుతున్న ప్రభుత్వ పథకాలు, ప్రజలకు కలుగుతున్న ప్రయోజనాలను పరిశీలించారు. అలాగే గుంటుపల్లి రైజ్ సెంటర్ ను కూడా సందర్శించి అక్కడ మహిళలకు అందిస్తున్న నైపుణ్య శిక్షణలు, ఉపాధి అవకాశాలు, స్వయం ఉపాధి కార్యక్రమాల గురించి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలో కార్యక్రమాలు సమర్ధవంతంగా అమలు జరుగుతున్నాయని చెప్పారు.
కలెక్టర్ లక్ష్మీశ ఆధ్వర్యంలో సంపూర్ణతా అభియాన్ 2.O కార్యక్రమం జిల్లాలో సమర్ధవంతంగా అమలవుతూ మంచి ఫలితాలు సాధిస్తుందన్నారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించి వివిధ శాఖల ద్వారా అమలవుతున్న కార్యక్రమాల పురోగతిపై సమీక్ష నిర్వహించారు.
మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులతో పరస్పర చర్చలు జరిపి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో డి.శకుంతల, తహసీల్దార్ వై.వెంకటేశ్వర్లు, వ్యవసాయ శాఖ అధికారి రజిని, కో – ఆర్డినేటర్ శ్రీనివాస్, డిప్యూటీ ఎంపీడీవో మనోజ్, పశు సంవర్ధక శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
