మహిళలకు 33 శాతం సీట్లు…

మహిళలకు 33 శాతం సీట్లు…

టీడీపీతోనే నిజమైన మహిళా సాధికారత

విజయవాడ, ఆంధ్రప్రభ : పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అయినా, కాకపోయినా మహిళలకు రాజకీయంగా సముచిత ప్రాతినిధ్యం కల్పించడం తెలుగుదేశం పార్టీ సంకల్పమని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ పేర్కొన్నారు.

మహానాడు వేదికగా వచ్చే ఎన్నికల్లో 33 శాతం సీట్లు మహిళలకు ఇవ్వాలని టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ చేసిన ప్రతిపాదన చారిత్రాత్మక నిర్ణయమని ఆమె అభివర్ణించారు. ఈ నిర్ణయం మహిళా సాధికారత పట్ల టీడీపీకి ఉన్న చిత్తశుద్ధిని మరోసారి దేశానికి చాటి చెప్పిందన్నారు.

మహిళలను కేవలం ఓటర్లుగా కాకుండా నాయకత్వ స్థానాల్లో నిలబెట్టాలనే దృఢ సంకల్పంతో టీడీపీ ముందుకు సాగుతోందని తెలిపారు. మహానేత ఎన్టీఆర్ మహిళలకు కుటుంబ ఆస్తిలో సమాన హక్కులు కల్పించారని, చంద్రబాబు నాయకత్వంలో డ్వాక్రా సంఘాలు బలోపేతం చేసి మహిళలను ఆర్థికంగా స్వావలంబులుగా తీర్చిదిద్దారని గుర్తుచేశారు.

పసుపు-కుంకుమ, వడ్డీ లేని రుణాలు, మహిళా భద్రత, విద్యా–ఉపాధి ప్రోత్సాహకాలు వంటి అనేక కార్యక్రమాలు టీడీపీ ప్రభుత్వాల నుంచే వచ్చాయని ఆమె పేర్కొన్నారు. మహిళలకు 33 శాతం రాజకీయ సీట్ల ప్రతిపాదన మహిళా చరిత్రలో స్వర్ణాక్షర ఘట్టమని అభివర్ణించారు.

మహిళల గౌరవం, ఆత్మవిశ్వాసం, రాజకీయ ఎదుగుదలకు టీడీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని గద్దె అనురాధ తెలిపారు.

Leave a Reply