8.4 cm | మండు వేసవిలో వెదర్ కూల్
8.4 cm | మండు వేసవిలో వెదర్ కూల్
ఏపీ, తెలంగాణలోని అకాల వర్షం
గ్రేటర్ హైదరాబాద్ వాసులకు ఉపశమనం
గాలి, వడగళ్ల వానతో విద్యుత్ సరపరాకు అంతరాయం
గ్రామీణ ప్రాంత రైతులకు అపారనష్టం
మరో రెండ్రోజుల పాటు వర్షాలుండే చాన్స్
8.4 cm | హైదరాబాద్ / అమరావతి , ఆంధ్రప్రభ : ఏపీ, తెలంగాణలో కొన్ని రోజులుగా రోహిణీ కార్తె ప్రభావంతో భానుడు భగభగమంటూ నిప్పుల కుంపటిలా మారాడు. తీవ్రమైన ఎండలు, ఉక్కపోత, వడగాలులతో సతమతమవుతున్న ప్రజలకు వాతావరణం ఒక్కసారిగా చల్లబడి ఊరటనిచ్చింది. మంగళవారం అర్ధరాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురవడంతో వాతావరణం కూల్‌గా మారింది. ఈ వర్ష ప్రభావంతో గణనీయంగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి.. ఇదే సమయంలో అకాల వర్షం పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయానికి, పంట నష్టానికి దారితీసింది. రాష్ట్ర రాజధాని భాగ్యనగర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి దాటిన తర్వాత వాన దంచికొట్టింది. ముఖ్యంగా ఐటీ కారిడార్ పరిధిలోని గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గంతో పాటు కుత్బుల్లాపూర్, మియాపూర్, చందానగర్, లింగంపల్లి పరిసర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడింది. దీంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. అర్ధరాత్రి కావడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పినప్పటికీ.. పలు చోట్ల చెట్లు విరిగిపడటంతో కరెంట్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
నగరంతో పాటు తెలంగాణలోని ఉమ్మడి మెదక్, రంగారెడ్డి, కరీంనగర్, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లోనూ వర్షం భీభత్సం సృష్టించింది. సిద్దిపేట జిల్లా ముస్త్యాలలో అత్యధికంగా 12.3 సెం.మీ వర్షపాతం నమోదైంది. మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్లో 11 సెం.మీ, నాగర్‌కర్నూలు జిల్లా తిమ్మాజిపేటలో 8.4 సెం.మీ చొప్పున వర్షం పడింది. కాగా, ఐనవోలు, సంగారెడ్డి పరిధిలోని కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం వర్షపు నీటిలో తడిసిపోవడంతో రైతాంగం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.
ఏపీలోనూ వానలు..
ఆంధ్రప్రదేశ్‌లో కూడా వాతావరణం మారింది. కొన్ని రోజులుగా మండుతున్న ఎండలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఈ వర్షాలు పెద్ద ఊరటగా మారాయి. రాష్ట్రంలోని పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురవడంతో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. పల్నాడు జిల్లాలో వర్ష ప్రభావం ఎక్కువగా కనిపించింది. నరసరావుపేట, సత్తెనపల్లి, పెదకూరపాడు ప్రాంతాల్లో బలమైన ఈదురు గాలులతో పాటు భారీ వర్షం పడింది. కొన్ని ప్రాంతాల్లో చెట్లు ఊగిపడేంతగా గాలులు వీచాయి. ఈదురుగాలుల కారణంగా విద్యుత్ లైన్లు దెబ్బతినడంతో నరసరావుపేటలో దాదాపు గంటపాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాయలసీమలోని వైఎస్సార్ కడప జిల్లాలో కూడా పలుచోట్ల వర్షాలు కురిశాయి. పులివెందుల, ఒంటిమిట్ట, పెండ్లిమర్రి, బద్వేలు ప్రాంతాల్లో వాతావరణం చల్లబడింది. ఈదురు గాలుల ప్రభావంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడినప్పటికీ, మండుతున్న వేసవిలో వచ్చిన ఈ వర్షాన్ని ప్రజలు ఆనందంగా స్వాగతించారు. అకాల వర్షాలతో కొంతమేర ఇబ్బందులు తలెత్తినా, ఎండల తీవ్రత తగ్గడంతో ప్రజలు ఉపశమనం పొందుతున్నారు. విద్యుత్ శాఖ అధికారులు దెబ్బతిన్న సరఫరా వ్యవస్థలను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టారు. రాబోయే రెండు రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కొనసాగొచ్చని వాతావరణ శాఖ సూచిస్తోంది.
