నూతన కోర్టు భవన పనుల పరిశీలన..

నూతన కోర్టు భవన పనుల పరిశీలన..

నాణ్యతపై కాంగ్రెస్ నేతల సూచనలు

భీమ్‌గల్ టౌన్, ఆంధ్రప్రభ: భీమ్‌గల్ మండల కేంద్రంలో నూతనంగా మంజూరైన కోర్టు భవన నిర్మాణ పనులను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పర్శ అనంతరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని గుత్తేదారుడికి సూచించారు. భవన నిర్మాణం వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

పనులు పూర్తయిన వెంటనే కోర్టును ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ అయిన కోర్టు మంజూరుకు కృషి చేసిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ముత్యాల సునీల్ కుమార్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కోర్టు అందుబాటులోకి వస్తే ఈ ప్రాంత కక్షిదారులకు న్యాయ సేవలు మరింత చేరువ అవుతాయని అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ సంగ్యా నాయక్, జిల్లా సర్పంచుల ఫోరం కార్యదర్శి అరిగెల జనార్ధన్, బాబాపూర్, రహత్‌నగర్ ఉప సర్పంచులు గోవర్ధన్, సేవలాల్, సీనియర్ నాయకులు పల్లె శేఖర్, కోరా డి. లింబాద్రి, రాగుల మోహన్, దిలీప్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.