ఎస్సెస్సీ పరీక్షా కేంద్రాలపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ..

ఎస్సెస్సీ పరీక్షా కేంద్రాలపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ..
నిబంధనల అమలుపై నిశిత పరిశీలన
కాపీయింగ్‌కు తావులేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశం
నిజామాబాద్ స్పోర్ట్స్, ఆంధ్రప్రభ : జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న పదవ తరగతి వార్షిక పరీక్షల నేపథ్యంలో సోమవారం కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మికంగా పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. జిల్లా కేంద్రంలోని మానిక్ భవన్ పాఠశాల, నలంద హైస్కూల్ ఎగ్జామ్ సెంటర్లను సందర్శించి పరీక్షల నిర్వహణను నిశితంగా పరిశీలించారు. విద్యార్థుల హాజరు, సిబ్బంది విధుల నిర్వహణపై ఆరా తీశారు. ప్రశ్నపత్రాలను నిర్ణీత సమయంలోనే తెరిచారా లేదా అని పరిశీలించిన కలెక్టర్, తప్పనిసరిగా సీసీ కెమెరా రికార్డింగ్ నడుమే ప్రశ్నపత్రాల బండిల్ సీల్స్ తెరవాలని సూచించారు. ఈ మేరకు నిబంధనలు పాటించారా లేదా అన్నది సీసీ ఫుటేజీల ద్వారా నిర్ధారించుకున్నారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీటి వసతి, ఆరోగ్య కార్యకర్తల అందుబాటు వంటి సౌకర్యాలను పరిశీలించారు.

ఎగ్జామ్ హాల్లోకి సిబ్బంది సెల్ ఫోన్లతో ప్రవేశించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా పరీక్షలు సజావుగా నిర్వహించాలని సూచించారు. ఎక్కడా కాపీయింగ్‌కు అవకాశం ఉండకూడదని, అలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. పరీక్షలు ముగిసే వరకు అప్రమత్తంగా విధులు నిర్వహించాలని, ప్రశ్నపత్రాలను పోలీసు బందోబస్తు మధ్య కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. పూర్తి పారదర్శకతతో పరీక్షలు నిర్వహించాలని పేర్కొన్నారు. ఈ తనిఖీల సమయంలో పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు జె. శంకర్, టి. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
