అర్జీల పరిష్కారంలో నాణ్యతే లక్ష్యం..

అర్జీల పరిష్కారంలో నాణ్యతే లక్ష్యం..

పెండింగ్ తగ్గించాలని కలెక్టర్ ఆదేశం

నంద్యాల, ఆంధ్రప్రభ : ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా స్వీకరించే అర్జీలను బియాండ్ ఎస్‌ఎల్‌ఏకు వెళ్లకుండా నిర్ణీత గడువులోగా నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు.

సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, డీఆర్వో రాము నాయక్, పీజీఆర్‌ఎస్ నోడల్ అధికారి ఉమామహేశ్వరి, ఆర్డీఓలు పాల్గొన్నారు.

కలెక్టర్ మాట్లాడుతూ అర్జీలను చివరి నిమిషం వరకు పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి గడువులోగా పరిష్కరించాలని సూచించారు. చివరి సమయంలో పరిష్కారం చేపడితే నాణ్యత తగ్గే అవకాశం ఉంటుందని తెలిపారు.

జిల్లాలో ఇప్పటివరకు 61,530 అర్జీలు స్వీకరించగా, 4,214 అర్జీలు పురోగతిలో ఉన్నాయని అధికారులు తెలిపారు. ఇంకా 128 అర్జీలు పరిశీలించాల్సి ఉందని, వాటిని వెంటనే ఓపెన్ చేసి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

రీఓపెన్ అయిన 5,310 అర్జీలలో 5,113 పరిష్కరించగా, 197 పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. వాటిని వారం రోజుల్లోగా పూర్తి చేయాలని సూచించారు. రీఓపెన్ శాతాన్ని 9.26 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని ఆదేశించారు.

వివిధ శాఖలు అర్జీదారులతో చరవాణి ద్వారా మాట్లాడి సమస్యలు పరిష్కరించాలన్న ఆదేశాలు ఉన్నప్పటికీ విద్యుత్, పౌర సరఫరాలు, మున్సిపల్, పంచాయతీరాజ్, పోలీస్, రెవెన్యూ, సెర్ప్, టిడ్కో, దేవాదాయ, అటవీ, రిజిస్ట్రేషన్, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖలు నివేదికలు సమర్పించకపోవడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు.

“వన్ మంత్ – ఫోర్ విజిట్” కార్యక్రమంలో భాగంగా ఆళ్లగడ్డలో రెండు విడతల్లో 1,139 అర్జీలు స్వీకరించినట్లు తెలిపారు.

రెవెన్యూ క్లినిక్స్ ద్వారా 153 అర్జీలు స్వీకరించగా, వాటిలో అడంగల్ సవరణలు, చుక్కల భూముల క్రమబద్ధీకరణ, అసైన్డ్ భూములు, భూ ఆక్రమణలు, ఆర్‌ఓఆర్ అంశాలు, సర్వే, రీ-సర్వే వంటి సమస్యలు ఉన్నాయని వివరించారు.