జొన్నగిరి పసిడి కల సాకారం..

  • పూర్తి స్థాయి బంగారం వెలికితీతకు శ్రీకారం..
  • ఆస్ట్రేలియా కంపెనీతో ఆరంభం…
  • భారతీయ సంస్థల చేతుల్లో ఉత్పత్తి

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో బంగారం ఉత్పత్తికి దాదాపు మూడు దశాబ్దాల నిరీక్షణకు తెరపడనుంది. స్వాతంత్ర్యం అనంతరం దేశంలో ప్రారంభమవుతున్న తొలి గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టుగా జొన్నగిరి గోల్డ్ మైన్ ప్రత్యేక గుర్తింపు పొందుతోంది. 1994లో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ ప్రాంతంలో బంగారు నిక్షేపాలను గుర్తించినప్పటికీ, భారీ పెట్టుబడుల అవసరం కారణంగా ప్రాజెక్టు ముందుకు సాగలేదు.

కేంద్ర ప్రభుత్వం విదేశీ పెట్టుబడులకు అవకాశం కల్పించడంతో ఆస్ట్రేలియాకు చెందిన జియో మైసూర్ సర్వీసెస్ సంస్థ రంగంలోకి దిగింది. తుగ్గలి, మద్దికెర మండలాల్లో 1494.55 ఎకరాల విస్తీర్ణంలో రూ.320 కోట్లతో గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును అభివృద్ధి చేసింది. మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో 2021లో ప్రొడక్షన్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటైంది. 2023లో చేపట్టిన పైలట్ ప్రాజెక్టు విజయవంతం కావడంతో పూర్తిస్థాయి ఉత్పత్తికి మార్గం సుగమమైంది.

దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా నిపుణుల సహకారంతో నిర్వహించిన పరీక్షల్లో సానుకూల ఫలితాలు రావడంతో ప్రాజెక్టు వాణిజ్య ఉత్పత్తి దశకు చేరుకుంది. ప్రస్తుతం జియో మైసూర్‌లో 70 శాతం వాటాను భారతీయ సంస్థ ‘‘త్రివేణి ఎర్త్ మూవర్స్’’ కొనుగోలు చేయగా, డెక్కన్ గోల్డ్ మైన్స్ సంస్థకు 27.27 శాతం వాటా ఉంది. దీంతో ఆస్ట్రేలియా సాంకేతికత, భారతీయ పెట్టుబడుల కలయికగా జొన్నగిరి గోల్డ్ మైన్ రూపుదిద్దుకుంది.

గోల్డ్ మైనింగ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రాయల్టీ, ఇతర పన్నుల రూపంలో ఆదాయం సమకూరనుండగా, ప్రత్యక్షంగా 300 మందికి, పరోక్షంగా వెయ్యి మందికి పైగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ఈ ప్రాజెక్టును ప్రారంభించనుండటంతో జొన్నగిరి పేరు దేశవ్యాప్తంగా మారుమోగనుంది.

ముఖ్యాంశాలు…

  • 1494.55 ఎకరాల్లో గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు,
  • రూ.320 కోట్ల పెట్టుబడితో నిర్మాణం,
  • 2021లో ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు,
  • 2023లో పైలట్ ప్రాజెక్టు విజయవంతం,
  • స్వాతంత్ర్యం తర్వాత దేశంలో తొలి కొత్త గోల్డ్ మైన్,
  • 300 మందికి ప్రత్యక్ష.. 1000 మందికి పైగా పరోక్ష ఉపాధి,
  • రాష్ట్ర ప్రభుత్వానికి రాయల్టీ,
  • పన్నుల రూపంలో ఆదాయం,
  • బుధవారం సీఎం చేతుల మీదుగా పూర్తి స్థాయి ఉత్పత్తి ప్రారంభం.