ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం వద్దు…

సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : ప్రజావాణిలో ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును సత్వరంగా, పారదర్శకంగా పరిష్కరించే దిశగా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని అడిషనల్ కలెక్టర్ సంగీత అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం ప్రదర్శించకుండా, నిర్ణీత గడువులోగా చర్యలు పూర్తి చేయాలని సూచించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లోని గ్రీవెన్స్ హాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సంగీత ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు.
వివిధ సమస్యలతో వచ్చిన ప్రజల నుంచి వివరాలు తెలుసుకుని సంబంధిత శాఖల అధికారులకు తగిన సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆమె ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. జిల్లాలో డివిజన్ వారీగా నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాల్లో మొత్తం 102 ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు. అందులో కలెక్టరేట్‌కు 44, సంగారెడ్డి డివిజన్‌కు 17, ఆందోల్ డివిజన్‌కు 7, నారాయణఖేడ్ డివిజన్‌కు 16, జహీరాబాద్ డివిజన్‌కు 18 ఫిర్యాదులు అందినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, రెవెన్యూ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
