అగ్ని ప్రమాదాల నివారణకు అవగాహన అత్యవసరం…

అగ్ని ప్రమాదాల నివారణకు అవగాహన అత్యవసరం…

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : అగ్ని ప్రమాదాల నివారణలో ప్రజల అవగాహన కీలక పాత్ర పోషిస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి పేర్కొన్నారు. అగ్నిమాపక వారోత్సవాల ముగింపు సందర్భంగా సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియం కారిడార్‌లో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అగ్నిమాపక పరికరాల ప్రదర్శనను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఏప్రిల్ 14 నుండి 20 వరకు నిర్వహించిన అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా జిల్లావ్యాప్తంగా విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు.

“సేఫ్ స్కూల్, సేఫ్ హాస్పిటల్ & ఫైర్ సేఫ్టీ సొసైటీ – టుగెదర్ ఫర్ ఫైర్ ప్రివెన్షన్” అనే ప్రధాన థీమ్‌తో కార్యక్రమాలు చేపట్టి అన్ని వర్గాల ప్రజల్లో అగ్ని భద్రతపై చైతన్యం కల్పించినట్లు పేర్కొన్నారు. అగ్ని ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, అపార్ట్మెంట్లు, కార్యాలయాలు, వాణిజ్య సముదాయాల్లో తప్పనిసరిగా అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రమాదం సంభవించిన వెంటనే అగ్నిమాపక శాఖ అత్యవసర సేవ నంబర్ 101కు సమాచారం అందిస్తే వేగవంతమైన సహాయం పొందవచ్చని తెలిపారు.

సమయస్ఫూర్తి, అప్రమత్తతతో ప్రాణ, ఆస్తి నష్టాలను గణనీయంగా తగ్గించుకోవచ్చని ఆమె వివరించారు. జిల్లా అగ్నిమాపక అధికారి అవినాష్ జయ సింహ మాట్లాడుతూ, వారోత్సవాల సందర్భంగా పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు, పరిశ్రమలు, వాణిజ్య సముదాయాలు, నివాస ప్రాంతాల్లో ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించినట్లు తెలిపారు. ప్రజల్లో బాధ్యతాయుత ప్రవర్తన, ముందస్తు జాగ్రత్తలపై విస్తృతంగా ప్రచారం చేపట్టినట్లు పేర్కొన్నారు.

అనంతరం అగ్నిప్రమాదాల నివారణకు సంబంధించిన పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి (ఇంచార్జి) చిరంజీవి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అనురాధ, ఏ.డి.ఎఫ్.వో చిన్న బజారి, లీడింగ్ ఫైర్‌మ్యాన్ రంగస్వామి, వెంకటరాముడు, కార్యాలయ సిబ్బంది మల్లికార్జున, రామాంజనేయులు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply