ఊట్కూర్ పెద్దచెరువు విస్తరణపై దశలవారీ ఉద్యమం
ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేటజిల్లాలో జీవో69మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకంకింద ఊట్కూర్ పెద్దచెరువు సామర్థ్యాన్ని వందల ఎకరాల నుంచి వేల ఎకరాలకు పెంచే ప్రతిపాదనపై ఊట్కూర్ ప్రభావిత గ్రామ కమిటీ ఆదివారం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సమావేశం నిర్వహించారు. ఇటీవల ఊట్కూర్ పెద్ద చెరువు పరిశీలనకు ప్రొఫెసర్లు, నీటిపారుదలశాఖఅధికారులు రావడం వారితో అఖిలపక్షం నాయకులు నిపుణుల బృందంతో తమ అనుమానాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ప్రాజెక్టు చేపడితే ఊట్కూర్ గ్రామానికి ఊటనీటి ముప్పు పెరిగి ఇళ్లు, ప్రభుత్వ ఆస్తులు, ప్రార్థన మందిరాలు సాగుభూములు ప్రమాదంలో పడే అవకాశముందనికమిటీసభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఊట పెరిగితే ప్రమాదంపొంచిందని దీంతో తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా తొలి దశలో మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఇతర అధికారులు ప్రజాప్రతినిధులను కలిసి వినతిపత్రాలు అందజేయాలని నిర్ణయించారు.
గ్రామంలోని ప్రతి వార్డులో సమావేశాలు నిర్వహించి చెరువు విస్తరణ వల్ల గ్రామానికి కలిగే నష్టాలను ప్రజలకు వివరించి అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.చెరువు నీటి నిల్వ సామర్థ్యం పెరగడం వల్ల ఊటనీటి సమస్య మరింత తీవ్రరూపం దాల్చి వందలాది ఇళ్లు, పాఠశాలలు, ప్రార్థనా స్థలాలు, పంట పొలాలు ప్రభావితమయ్యే ప్రమాదం ఉందని ప్రజలకు వివరించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రభావిత కుటుంబాలకు పూర్తి స్థాయి పునరావాసం, సీపేజ్ కటాఫ్ వాల్ వంటి రక్షణ చర్యలు చేపట్టే వరకు దశలవారీ ఉద్యమాన్ని కొనసాగిస్తామనికమిటీసభ్యులు హెచ్చరించారు.
ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ప్రభుత్వ అధికారులు ప్రజా ప్రతినిధులు డిపిఆర్ ఎందుకు ఇవ్వడంలేదని, డి పి ఆర్ ఇవ్వకపోవడంవల్ల పలు అనుమానాలు వస్తున్నాయని వెంటనే డిపిఆర్ ఇవ్వడంతో పాటు ఊట్కూర్ పెద్ద చెరువు విస్తరణతో కలిగే లాభనష్టాలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో అధ్యక్షులు బాల్ రెడ్డి, ఉప సర్పంచ్ రమేష్, మాజీ సర్పంచ్ భాస్కర్, మాజీ జెడ్పిటిసి అరవింద్ కుమార్, మాజీ ఉపసర్పంచ్ కొండన్ గోపాల్ కాంట్రాక్టర్ లక్ష్మారెడ్డి, నాయకులు ఎం శేషప్ప,ఆశప్ప, లక్ష్మణ్, భరత్, శివరాజ్ రెడ్డి, ఆనంద్ రెడ్డి, షేక్ సమీ తదితరులుపాల్గొన్నారు.
