ఏరియా ఆసుపత్రిలో తొలి టోటల్ హిప్ రీప్లేస్‌మెంట్ విజయవంతం
హైదరాబాద్ వెళ్లకుండానే ఇక్కడే అధునాతన చికిత్సలు
క్యాతన్‌పల్లి, ఆంధ్రప్రభ: సింగరేణి కార్మికులు, గ్రామీణ ప్రాంత ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రిలో తొలిసారిగా నిర్వహించిన టోటల్ హిప్ రీప్లేస్‌మెంట్ శస్త్రచికిత్స విజయవంతమైంది.
ఆర్‌కేఎన్‌టీ మైన్‌కు చెందిన ఐలయ్య (55) గత కొంతకాలంగా తీవ్రమైన తుంటి నొప్పితో బాధపడుతున్నారు. దీంతో ఏరియా ఆసుపత్రిలోని అత్యాధునిక పరికరాలతో ఆర్థోపెడిక్ వైద్య బృందం ఆయనకు టోటల్ హిప్ రీప్లేస్‌మెంట్ (టీహెచ్‌ఆర్) శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించింది.
శస్త్రచికిత్స జరిగిన వారం రోజులు పూర్తికాకముందే ఆదివారం కుట్లు తొలగించారు. వైద్యుల పర్యవేక్షణలో రోగి స్వయంగా నడక ప్రారంభించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం పూర్తిగా సంతృప్తికరంగా ఉందని వైద్యులు తెలిపారు.
ఈ సందర్భంగా డివిజనల్ సీఎంఓ డాక్టర్ మధు కుమార్ మాట్లాడుతూ సింగరేణి కార్మికులు, గ్రామీణ ప్రాంత ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని తెలిపారు.
“ఇకపై హైదరాబాద్ వెళ్లకుండానే ఇక్కడే అత్యున్నత స్థాయి ఆపరేషన్లు చేయగలుగుతున్నాం. ఇది మా వైద్య బృందం కృషికి నిదర్శనం” అని అన్నారు.
ఈ శస్త్రచికిత్సలో డాక్టర్ సుహాసిని, డాక్టర్ నరేష్ నేతృత్వంలోని ఆర్థో బృందం, అనస్తీషియా వైద్యుడు డాక్టర్ మధుకర్, ఓటీ ఇన్‌చార్జ్ జ్యోతి సిస్టర్, నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
