రైతు సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ధ్యేయం..

రైతు సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ధ్యేయం..
ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే వంశీకృష్ణ
మొక్కజొన్న కొనుగోళ్లను వేగవంతం చేస్తున్నాం..
రైతు రాజ్యానికి బాటలు వేస్తున్న రేవంత్ సర్కార్
అచ్చంపేట, మే 23 (ఆంధ్రప్రభ): తెలంగాణలో కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం రైతు సంక్షేమానికే మొదటి ప్రాధాన్యత ఇస్తోందని నాగర్‌కర్నూల్ ఎంపీ Mallu Ravi, అచ్చంపేట ఎమ్మెల్యే Chikkudu Vamshi Krishna అన్నారు. రైతుల అభ్యున్నతే లక్ష్యంగా ముఖ్యమంత్రి A. Revanth Reddy పాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు.
ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అచ్చంపేట నియోజకవర్గంలోని పదర గ్రామ రైతు వేదికలో నిర్వహించిన “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు – అన్నదాతల అవగాహన సదస్సు” ముగింపు కార్యక్రమంలో ఎంపీ మల్లు రవి, టీపీసీసీ ఉపాధ్యక్షులు, డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.
ఈ సందర్భంగా ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గత 30 రోజులుగా రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిల్లో రైతులతో నేరుగా ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహిస్తూ భూసార పరిరక్షణ, అధిక యూరియా వాడకం వల్ల కలిగే నష్టాలు, పంట మార్పిడి, ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన కల్పిస్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,600 గ్రామాల్లో 400 మంది శాస్త్రవేత్తలతో కలిసి రెండు లక్షల మంది రైతులకు శిక్షణ అందించామని తెలిపారు.
రైతులకు రూ.21 వేల కోట్లతో రూ.2 లక్షల వరకు రుణమాఫీ అమలు చేశామని, రైతుబంధు ద్వారా రైతు రాజ్యానికి బాటలు వేస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి సోమవారం రైతులు ఇచ్చే ఫిర్యాదులను వారంలోనే పరిష్కరించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు.
మొక్కజొన్న కొనుగోళ్లలో జాప్యాన్ని తగ్గించేందుకు నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ ప్రత్యేక చర్యలు చేపడుతున్నారని తెలిపారు. ప్రైవేట్ రవాణా వాహనాలు ఏర్పాటు చేయడంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి హమాలీలను రప్పించి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని చెప్పారు. గన్ని బ్యాగులు, గోదాముల కొరత, రవాణా సమస్యలు ఉన్నప్పటికీ రైస్ మిల్లులు, కాటన్ మిల్లులను అద్దెకు తీసుకొని సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
రైతులను వానాకాలం సాగుకు సిద్ధం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందని, ఆధునిక సాగు పద్ధతులు, తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించే విధానాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాలు దోహదపడుతున్నాయని తెలిపారు.
కేంద్రంపై విమర్శలు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ మాట్లాడుతూ, స్థానిక రైతుల మొక్కజొన్న కొనుగోళ్లను పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం అమెరికా నుంచి దిగుమతులు చేసుకోవడం రైతులకు నష్టం కలిగిస్తోందని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం మొక్కజొన్నకు రూ.2,400 మద్దతు ధరతో పాటు రూ.500 సబ్సిడీ అందిస్తోందని గుర్తు చేశారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లపాటు రైతు సంక్షేమాన్ని విస్మరించిందని, ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ K. T. Rama Rao అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రామనాథం, అంతటి మల్లేష్, నాయకులు గోపాల్ రెడ్డి, రాంబాబు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
