మూసీపై చెక్‌డ్యామ్.. రైతులకు సాగునీటి ఆశలు

మూసీపై చెక్‌డ్యామ్.. రైతులకు సాగునీటి ఆశలు

మోత్కూర్, ఆంధ్రప్రభ: మోత్కూర్ మండలంలోని పొడిచేడు, అమ్మనబోలు గ్రామాల మధ్య మూసీ నదిపై చెక్‌డ్యామ్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజినీర్ నాగభూషణం అధికారులను ఆదేశించారు. మూసీ నదిపై శిథిలావస్థకు చేరుకున్న లోలెవల్ పాత రోడ్డును పూర్తిగా తొలగించి, ఆ ప్రాంతంలో చెక్‌డ్యామ్ నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా నీటిపారుదల శాఖ అధికారులు ఆ ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా స్థానికులు అధికారులకు సమస్యను వివరించారు. ప్రతి సంవత్సరం మూసీ నదికి వరదలు వచ్చిన సమయంలో శిథిలమైన లోలెవల్ రోడ్డులో మనుషులు, పశువులు, గొర్రెలు చిక్కుకుని ప్రాణాలు కోల్పోతున్నాయని తెలిపారు. ఇప్పటివరకు ఆరుగురు మృతి చెందినట్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్తులు కోరారు. పరిశీలన అనంతరం ఇరిగేషన్ సీఈ నాగభూషణం మాట్లాడుతూ.. సమీపంలో వంతెన అందుబాటులో ఉన్నందున ప్రమాదకరంగా మారిన పాత లోలెవల్ రోడ్డును పూర్తిగా తొలగించడం సమంజసమని అభిప్రాయపడ్డారు.

బ్రిడ్జికి దిగువన సుమారు 500 మీటర్ల దూరంలో చెక్‌డ్యామ్ నిర్మిస్తే రైతులకు సాగునీటి సౌకర్యం మెరుగుపడుతుందని తెలిపారు. భూగర్భ జలాలు పెరిగేందుకు కూడా ఇది ఉపయోగపడుతుందన్నారు. చెక్‌డ్యామ్ నిర్మాణానికి అవసరమైన అంచనాలను వెంటనే సిద్ధం చేసి పంపించాలని సంబంధిత అధికారులను నాగభూషణం ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు, మోత్కూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వంగాల సత్యనారాయణ, నీటిపారుదల శాఖ జిల్లా ఎస్‌ఈ శివధర్మతేజ, ఈఈ సత్యనారాయణ, ఏఈలు చంద్రశేఖర్, విక్రమ్, హరీష్, పొడిచేడు గ్రామ సర్పంచ్ జిట్ట సైదులు, ఉపసర్పంచ్ బండ లింగయ్య, మాజీ ఉపసర్పంచ్ కప్పే వెంకన్న, వార్డు సభ్యులు చిందాల బీరుమల్లు, నల్ల రామనర్సయ్య, ఎనిగే మచ్చగిరి, ఫీల్డ్ అసిస్టెంట్ వీరాస్వామి, రచ్చ చందు, నల్ల యాదగిరి, ఇటవబోయిన శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.