Journalists |జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై భట్టి కీలక హామీ
- సొసైటీలతో సంబంధం లేకుండా ఇచ్చేలా కృషి
- న్యాయపరమైన చిక్కులు లేకుండా ఉంటాయని స్పష్టత
- సీఎంకు సూచిస్తానన్న ఉప ముఖ్యమంత్రి భట్టి
- టీడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా కమిటీ వినతిపై స్పందన
ఖమ్మం, ఆంధ్రప్రభ: సొసైటీలతో సంబంధం లేకుండా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించే అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్–హెచ్–2843) ఖమ్మం జిల్లా కమిటీ గురువారం చింతకాని మండలం లచ్చగూడెంలో సమర్పించిన వినతిపత్రంపై ఆయన సానుకూలంగా స్పందించారు. శుక్రవారం జగన్నాథపురంలో నిర్వహించనున్న రైతు ఆశీర్వాద సభకు ముఖ్యమంత్రి హాజరవుతున్న నేపథ్యంలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాలని ఫెడరేషన్ ప్రతినిధులు కోరారు.
దీనిపై స్పందించిన భట్టి విక్రమార్క.. సొసైటీల ద్వారా స్థలాల కేటాయింపులో న్యాయపరమైన చిక్కులు ఉన్నందున, వాటికి అతీతంగా వ్యక్తిగతంగా, బీపీఎల్ కోటా లేదా ఇతర విధానాల ద్వారా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అందించే మార్గాలను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.
వినతిపత్రంలో టీడబ్ల్యూజేఎఫ్ నేతలు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అధిక సంఖ్యలో జర్నలిస్టులు పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారని, తక్కువ వేతనాలతో అద్దె ఇళ్లలో నివసిస్తూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం గత, ప్రస్తుత ప్రభుత్వాల దృష్టికి పలుమార్లు విజ్ఞప్తులు చేయడంతో పాటు ఉద్యమాలు కూడా నిర్వహించినట్లు తెలిపారు.
గత ప్రభుత్వం వెలుగుమట్ల–వీవీ పాలెం రెవెన్యూ పరిధిలో 23 ఎకరాలకు పైగా భూమిని కేటాయిస్తూ జీవో జారీ చేసినప్పటికీ, అది అమలుకు నోచుకోలేదని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కొన్ని న్యాయపరమైన సందిగ్ధతలు ఏర్పడినప్పటికీ, సొసైటీలతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా ఇళ్ల స్థలాలు ఇస్తామని ముఖ్యమంత్రి ఇప్పటికే హామీ ఇచ్చారని పేర్కొన్నారు.
ఈ ప్రక్రియలో జాప్యాన్ని వీడి, జర్నలిస్టులకు ఏ ప్రాతిపదికన, ఎప్పటిలోగా ఇళ్ల స్థలాలు కేటాయిస్తారో నిర్దిష్టమైన గడువుతో ప్రకటించేలా ముఖ్యమంత్రితో చర్చించాలని ఉపముఖ్యమంత్రిని కోరారు.
వినతిపత్రం సమర్పించిన వారిలో టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ ఖదీర్, జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యక్షుడు దువ్వా సాగర్, టీబీజేఏ జిల్లా అధ్యక్షుడు ఆవుల శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి మానుకొండ రవికిరణ్, జిల్లా కమిటీ సభ్యులు రాంపుడి నాగేశ్వరరావు, కొత్త యాకేష్, మంకెన నాగేశ్వరరావు, నూకల రామచంద్రమూర్తి, కొమెర నాగేశ్వరరావు, ఖమ్మం నియోజకవర్గ అధ్యక్షుడు తురగ రాఘవేంద్రమూర్తి, కార్యదర్శి గరిడేపల్లి వెంకటేశ్వర్లు, స్టేట్ కౌన్సిల్ సభ్యురాలు నలుబోల మధుశ్రీ, టీబీజేఏ కెమెరామెన్ అసోసియేషన్ అధ్యక్షుడు ఫయాజ్, కార్యదర్శి గణేష్, అర్షద్, శరత్, సీహెచ్ ప్రసాద్, సురేందర్, గడ్డం విజయ్ తదితరులు పాల్గొన్నారు.
