పిడుగుపాటుకు రెండు ఎద్దులు మృతి..

పిడుగుపాటుకు రెండు ఎద్దులు మృతి..

రైతు కుటుంబంలో విషాదం

అప్పు చేసి కొనుగోలు చేసిన పశువులు కోల్పోయి రైతు ఆవేదన

అచ్చంపేట, మే 23 (ఆంధ్రప్రభ): నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలోని బుడ్డ తాండలో విషాద ఘటన చోటుచేసుకుంది. శనివారం సాయంత్రం కురిసిన అకాల వర్షం సమయంలో పిడుగుపాటుకు గిరిజన రైతు మోత్యకు చెందిన రెండు పశువులు మృతి చెందాయి.

వ్యవసాయ పనుల కోసం పొలంలో చెట్టుకు కట్టేసి ఉంచిన ఎద్దులపై ఒక్కసారిగా పిడుగు పడటంతో అవి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాయి. ఈ ఘటనతో రైతు కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

ఇటీవలే రూ.1.10 లక్షలు అప్పు చేసి ఈ రెండు పశువులను కొనుగోలు చేసినట్లు రైతు మోత్య తెలిపారు. వ్యవసాయ పనులకు అవే ప్రధాన ఆధారమని, అనుకోకుండా పిడుగుపాటుకు మృతి చెందడంతో తీవ్రంగా నష్టపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. “ఇక వ్యవసాయం ఎలా చేయాలో అర్థం కావడం లేదు” అంటూ కన్నీటి పర్యంతమయ్యారు.

ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన నష్టపరిహారం అందించి ఆదుకోవాలని రైతు మోత్య విజ్ఞప్తి చేశారు.