అప్పాజీపేట పాఠశాల ఎదుట స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి
విద్యార్థుల భద్రతకు తక్షణ చర్యలు చేపట్టాలని పంచాయతీ కార్యదర్శికి జనసేన వినతిపత్రం
నల్లగొండ రూరల్, ఆంధ్రప్రభ: అప్పాజీపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఎదుట ప్రధాన రహదారి ప్రమాదకరంగా మారిందని, విద్యార్థుల భద్రత దృష్ట్యా వెంటనే స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా యువజన విభాగం ఉపాధ్యక్షుడు పున్నం రాంబాబు (పవన్ కళ్యాణ్) డిమాండ్ చేశారు.
గురువారం నల్లగొండ మండలం అప్పాజీపేట పంచాయతీ కార్యదర్శికి వినతిపత్రం అందజేసిన అనంతరం ఆయన మాట్లాడారు. పాఠశాలలో చిన్నారులు విద్యాభ్యాసం చేస్తున్న నేపథ్యంలో పాఠశాల ఎదుట ఉన్న వెడల్పాటి సీసీ రోడ్డుపై వాహనాలు అధిక వేగంతో ప్రయాణిస్తున్నాయని, దీంతో ఎప్పుడైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
విద్యార్థుల రక్షణ కోసం పాఠశాల ఎదుట వెంటనే స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని, గేటు పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ను మరోచోటికి తరలించాలని కోరారు. అలాగే పాఠశాల ఆవరణలో విద్యార్థులు సురక్షితంగా ఆడుకునేలా మట్టి, ఇసుకతో సమతలీకరణ పనులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
విద్యార్థుల సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలని, లేకపోతే జనసేన ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని పున్నం రాంబాబు హెచ్చరించారు.
