Hydrogen train | జూలై 17న హైడ్రోజన్ రైలుకు శ్రీకారం?
Hydrogen train | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : పర్యావరణహిత రవాణా వ్యవస్థను ప్రోత్సహించే దిశగా భారతీయ రైల్వే కీలక అడుగు వేస్తోంది. దేశాన్ని నెట్ జీరో కార్బన్ ఉద్గారాల లక్ష్యానికి చేరువ చేసే ప్రతిష్టాత్మక హైడ్రోజన్ రైలు ప్రాజెక్టు తుది దశకు చేరుకుంది. ఈ అత్యాధునిక రైలును ప్రధాని నరేంద్ర మోదీ జూలై 17న హర్యానాలోని జీంద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఈ పైలట్ ప్రాజెక్టు కోసం భారతీయ రైల్వే హర్యానాను ఎంపిక చేసింది. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ సాంకేతికతతో నడిచే ఈ రైలు డీజిల్ లేదా బొగ్గు ఇంధనంపై ఆధారపడదు. ఇంధనంగా హైడ్రోజన్‌ను ఉపయోగించే ఈ రైలు నుంచి కార్బన్ ఉద్గారాలు వెలువడవు. ఉప ఉత్పత్తిగా కేవలం నీటి ఆవిరి మాత్రమే విడుదల కావడం వల్ల ఇది పూర్తిగా పర్యావరణహిత రవాణా వ్యవస్థగా నిలవనుంది.
ఈ రైలులో ఒకేసారి 682 మంది కూర్చునే సౌకర్యం ఉండగా, మొత్తం సుమారు 2,600 మంది ప్రయాణికులు ప్రయాణించే సామర్థ్యం ఉంది. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే దేశంలోని మరిన్ని మార్గాల్లో కూడా హైడ్రోజన్ రైళ్లను ప్రవేశపెట్టే దిశగా భారతీయ రైల్వే ముందుకు సాగే అవకాశం ఉంది.
