ప్రజాసేవే నిజమైన రాజకీయ గుర్తింపు

ప్రజాసేవే నిజమైన రాజకీయ గుర్తింపు
ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ
అచ్చంపేట, ఆంధ్రప్రభ : ప్రజా ప్రతినిధులు సేవకులుగా భావించి ప్రజలకు నిస్వార్థంగా సేవలందించినప్పుడే గుర్తింపు, పదవులు సహజంగానే వస్తాయని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. రాజకీయాల్లో శాశ్వత వీడ్కోలు ఉండదని, ప్రజల మధ్య నిరంతరం ఉండే వారికే అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు. శుక్రవారం అచ్చంపేట పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన మున్సిపల్ పాలకవర్గం ఆత్మీయ వీడ్కోలు సమావేశంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య పాలనలో అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం ఉంటేనే ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని తెలిపారు. ఇప్పటివరకు కౌన్సిలర్లు ప్రజలకు అందుబాటులో ఉంటూ మంచి సేవలందించారని ఎమ్మెల్యే అభినందించారు. అచ్చంపేట పట్టణ సమగ్ర అభివృద్ధి కోసం రూ.100 కోట్ల నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ను ఇప్పటికే కోరినట్లు చెప్పారు.
త్వరలో మరోసారి ముఖ్యమంత్రిని కలిసి పట్టణ అభివృద్ధి అంశాలను వినిపిస్తామని వెల్లడించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నామని ఎమ్మెల్యే తెలిపారు. అచ్చంపేట పట్టణంలో సుమారు 30 శాతం వరకు నోటిఫైడ్ కాని ఇండ్లు ఉన్నాయని, వాటిని త్వరలో గుర్తించి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామని చెప్పారు.
బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (బిఆర్ఎస్) తీసుకువచ్చి ఆయా ఇండ్లకు నంబర్లు కేటాయించి రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేయడం ద్వారా అట్టి గృహ యజమానులకు భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు ఉత్పన్నము కావని అన్నారు. ప్రజా ప్రతినిధులు అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తేనే గుర్తింపు లభిస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
మున్సిపల్ ఎన్నికలు జరిగే వరకు మాజీ కౌన్సిలర్ల సలహాలు, సూచనల మేరకు పట్టణ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని మున్సిపల్ సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మురళి, ఏఈ రాజు నాయక్, తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు, కౌన్సిలర్లు, మున్సిపల్ శాఖ సిబ్బంది, పట్టణ ప్రజలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
