అర్ధరాత్రి వేళ జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీలు
అర్ధరాత్రి వేళ జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీలు
నైట్ బీట్, పెట్రోలింగ్ విధులను స్వయంగా పరిశీలించిన ఎస్పీ
ప్రజల భద్రతే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని దిశానిర్దేశం
శ్రీ సత్య సాయి బ్యూరో, ఆంధ్రప్రభ : శ్రీ సత్య సాయి జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లాలో శాంతిభద్రతలను మరింత పటిష్టం చేయడం, రాత్రివేళల్లో నేరాల నివారణకు ముందస్తు చర్యలను బలోపేతం చేయడం లక్ష్యంగా శుక్రవారం అర్ధరాత్రి వేళ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలు కదిరి పట్టణంలోని కదిరి అర్బన్ సర్కిల్ పోలీస్ స్టేషన్‌తో పాటు వలీసాబ్ రోడ్, నిజాం కాలనీ, కుటాగుళ్ల ప్రాంతాలు, నల్లచెరువు పోలీస్ స్టేషన్ పరిధిలో కొనసాగాయి. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది హాజరు, బాధ్యతల నిర్వహణ, నైట్ బీట్ వ్యవస్థ పనితీరును జిల్లా ఎస్పీ స్వయంగా పరిశీలించారు.
అనంతరం బీట్ పాయింట్లు, పెట్రోలింగ్ ప్రాంతాల్లో పర్యటించి రాత్రి గస్తీ, భద్రతా చర్యలు ఎలా అమలవుతున్నాయో సమీక్షించారు. జిల్లా హెడ్‌క్వార్టర్స్‌తో కమ్యూనికేషన్ వ్యవస్థపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అత్యవసర పరిస్థితుల్లో స్పందించే విధానం, రాత్రి గస్తీ నిర్వహణ, అనుమానితుల కదలికలపై సమాచార సేకరణ వంటి అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బందితో నేరుగా మాట్లాడిన ఎస్పీ, ప్రజల భద్రత విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.
ముఖ్యంగా రాత్రివేళల్లో మహిళలు, వృద్ధులు, ప్రయాణికుల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ప్రధాన రహదారులు, వ్యాపార సముదాయాలు, బ్యాంకులు, ఏటీఎంలు, దేవాలయాలు మరియు జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో బీట్ వ్యవస్థ సమర్థవంతంగా కొనసాగాలని స్పష్టం చేశారు. ప్రతి ప్రాంతంలో నిరంతర పర్యవేక్షణ ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
అనుమానాస్పద వ్యక్తులపై ప్రత్యేక నిఘా..
రాత్రివేళల్లో అనుమానాస్పదంగా సంచరించే వ్యక్తుల వివరాలను నమోదు చేయడంతో పాటు అవసరమైతే వేలిముద్రలు సేకరించాలని ఎస్పీ సూచించారు. అక్రమ రవాణా, చట్టవ్యతిరేక కార్యకలాపాలు, దొంగతనాలు మరియు ఇతర అసాంఘిక చర్యలపై ప్రత్యేక నిఘా కొనసాగించాలని స్పష్టం చేశారు.
వాహన తనిఖీలు మరింత కట్టుదిట్టం..
వాహన తనిఖీలను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని, బీట్ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా అప్రమత్తతతో విధులు నిర్వర్తించాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ మాట్లాడుతూ, “ప్రజల రక్షణ, నేరాల నివారణే పోలీస్ శాఖ ప్రధాన ధ్యేయం” అని పేర్కొన్నారు. రాత్రివేళల్లో భద్రతా చర్యలు మరింత బలోపేతంగా కొనసాగుతాయని తెలిపారు. అత్యవసరం ఉంటే తప్ప అనవసరంగా రాత్రివేళల్లో బయట సంచరించవద్దని ప్రజలకు సూచించారు. అనుమానాస్పద కదలికలు గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు. జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు. ఈ తనిఖీలలో శివనారాయణ స్వామి, నారాయణరెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
