జాగిర్యాలలో ‘ఫ్రైడే డ్రైడే’ కార్యక్రమం
భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ: నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్‌గల్ మండలం జాగిర్యాల గ్రామంలో సర్పంచ్ గడాల ప్రసాద్ ఆధ్వర్యంలో శుక్రవారం ‘ఫ్రైడే డ్రైడే’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రోడ్లపై నిల్వ ఉన్న నీటిలో ఆయిల్ బాల్స్ వేయడంతో పాటు బురద ప్రాంతాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లి దోమల వ్యాప్తిని నివారించే చర్యలు చేపట్టారు.
వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా గ్రామంలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది, వార్డు సభ్యులు, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లు, గ్రామ కార్యదర్శి, కరోబార్ తదితరులు పాల్గొన్నారు.
