మెగా డీఎస్సీపై వైసీపీ ఆరోపణలు నిరాధారం

మెగా డీఎస్సీపై వైసీపీ ఆరోపణలు నిరాధారం

నిరుద్యోగ యువత భవిష్యత్తుతో రాజకీయాలు చేయొద్దని విద్యార్థి, యువజన సంఘాల హెచ్చరిక

విజయవాడ, ఆంధ్రప్రభ: మెగా డీఎస్సీ నియామక ప్రక్రియపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని విద్యార్థి, యువజన, నిరుద్యోగ సంఘాల నాయకులు విమర్శించారు. నిరుద్యోగ యువతకు ఉపాధ్యాయ ఉద్యోగాలు లభించడాన్ని జీర్ణించుకోలేక రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో “నిరుద్యోగ యువతపై వైసీపీ గొడ్డలి వేటు” అనే అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీఎన్‌ఎస్‌ఎఫ్ ప్రధాన కార్యదర్శి పుల్లగుర చరణ్ యాదవ్, ఆర్‌వైఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పరుచూరి రాజేంద్రబాబు, నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ షేక్ సిద్ధిక్, ఏబీవీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట గోపి, బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై. నాగేశ్వరరావు, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేరెల్లి ఎలీషా తదితరులు పాల్గొని ప్రసంగించారు.

వక్తలు మాట్లాడుతూ.. యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మెగా డీఎస్సీ ఫైల్‌పై తొలి సంతకం చేశారని గుర్తుచేశారు. మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో 16 వేల ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు తెలిపారు.

మెగా డీఎస్సీని అడ్డుకునేందుకు 241 కేసులు కోర్టుల్లో దాఖలయ్యాయని, అయినప్పటికీ ఎలాంటి న్యాయపరమైన అవరోధాలు లేకుండా 110 రోజుల వ్యవధిలో పూర్తి పారదర్శకతతో ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించి, అర్హులైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించారని పేర్కొన్నారు.

నియామక ప్రక్రియ పూర్తై దాదాపు ఏడాది గడిచిన తర్వాత అక్రమాల ఆరోపణలు చేయడం రాజకీయ దురుద్దేశమేనని వక్తలు విమర్శించారు. ఈ వ్యాఖ్యల ద్వారా ఉద్యోగాలు పొందిన 16 వేల మంది ఉపాధ్యాయుల ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

పేద, మధ్యతరగతి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావడాన్ని వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని ఆరోపించారు. డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులకు, నిరుద్యోగ యువతకు వైసీపీ నాయకులు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

మెగా డీఎస్సీపై చేస్తున్న ఆరోపణలను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ యువతతో కలిసి ఆందోళనలు చేపడతామని విద్యార్థి, యువజన సంఘాల నేతలు హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో టీఎన్‌ఎస్‌ఎఫ్ నాయకులు దాడి మురళి, సంజయ్ వర్మ, ఆర్‌వైఎస్‌ఎఫ్ నాయకులు పడమట నరేష్, తెలుగు యువత నాయకులు అనిల్, నిరుద్యోగ అభ్యర్థులు శంకర్, వెంకటరాజు, మణికంఠ, వడ్లమూడి వంశీ చౌదరి, రవి, కె. కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply