చెన్నూర్ ఎస్బీఐ బ్రాంచ్-2లో నిలిచిపోయిన సేవలు

చెన్నూర్ ఎస్బీఐ బ్రాంచ్-2లో నిలిచిపోయిన సేవలు

చెన్నూర్, ఆంధ్రప్రభ:
మంచిర్యాల జిల్లా చెన్నూర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ -2లో బుధవారం బ్యాంక్ సేవలు స్తంభించిపోయాయి. గత తొమ్మిది నెలల నుంచి ఇప్పటి వరకు తమ గోల్డ్ తమకు ఇవ్వకుండా దాటవేస్తూ లేనిపోని సమాధానాలు చెబుతున్నారని గోల్డ్ లోన్ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

గత నవంబర్ నెలలో చెన్నూరు బ్యాంకులో బాధితులు దాచుకున్న గోల్డ్ పై బ్యాంకు క్యాషియర్ నరిగె రవీందర్ బినామీ రుణాలు తీసుకొని కుంభకోణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. దాదాపు 21 కిలోల కస్టమర్ల బంగారాన్ని ఇతర బ్యాంకుల్లో కుదువ పెట్టి రుణాలు తీసుకోవడం జరిగింది. ఈ కుంభకోణం వెలుగులోకి రావడం, పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది.

కోర్టు పరిధిలో ఉన్న బంగారాన్ని తిరిగి తమకు ఇప్పించడంలో బ్యాంక్ అధికారులు విఫలమవుతున్నారని ఆగ్రహం చెందిన బాధితులు బుధవారం ఆందోళన చేపట్టారు. గోల్డ్ లోన్ బాధితులకు బ్యాంకు అధికారులు విభిన్న రకాల నోటీసులు పంపిస్తుండడం పట్ల బాధితులు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు.

ఇందులో భాగంగానే బుధవారం గోల్డ్ బాధితులు అందరూ కలిసి ఎస్బిఐ రెండవ బ్రాంచ్‌ను మూకుమ్మడిగా ముట్టడి చేసి బ్యాంక్ సేవలను నిలిపివేశారు. ఉన్నతాధికారులు వచ్చి స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోతే ఉద్యమం మొదలు పెడతామని హెచ్చరించారు.