ఆవకాయతోనే ఆరోగ్యం..

ఆవకాయతోనే ఆరోగ్యం..

  • -ప్లాస్టిక్‌కు దూరంగా ఉందాం!
  • సురక్ష సేవ ఆధ్వర్యంలో ‘ఆవకాయ అద్భుతః.. అదరహో’ కార్యక్రమం

విజయవాడ, ఆంధ్రప్రభ:

మనం నిత్యం తీసుకునే ఆహారంలో ఆవకాయకు ప్రత్యేక స్థానం ఉందని, అయితే దానిని ప్లాస్టిక్ పాత్రల్లో కాకుండా సాంప్రదాయబద్ధంగా పింగాణీ జాడీల్లో నిల్వ చేసుకున్నప్పుడే పూర్తి ఆరోగ్యం చేకూరుతుందని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. బుధవారం గాయత్రీ నగర్ లోని సురక్ష సేవ కార్యాలయంలో సురక్ష సేవ కన్వీనర్ కే.వి. నరసయ్య ఆధ్వర్యంలో ‘ఆవకాయ అద్భుతః.. అదరహో’ అనే వినూత్న కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధ, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ వాసవి ముఖ్య అతిథులుగా విచ్చేసి ఆవకాయ పచ్చడిని పంపిణీ చేసి అనంతరం ఆవకాయ పై తయారు చేసిన ప్రత్యేక గీతాన్ని ఆవిష్కరించారు.

​ఈ సందర్భంగా గద్దె అనురాధ, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ వాసవి మాట్లాడుతూ, మానవ శరీరానికి అవసరమైన విటమిన్-సి ఆవకాయ ద్వారా లభిస్తుందని వివరించారు. పూర్వీకులు ఎంతో ఆలోచించి విటమిన్-సి నిల్వ కోసం ఈ పచ్చడి విధానాన్ని తీసుకువచ్చారన్నారు. అయితే, ప్రస్తుత కాలంలో పచ్చళ్లను ప్లాస్టిక్ సీసాలలో నిల్వ చేయడం వల్ల అందులోని రసాయనాలు కలిసి విషతుల్యంగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పూర్వపు పద్ధతిలో పింగాణీ జాడీలను వాడటం వల్ల పచ్చడిలోని పోషక విలువలు దెబ్బతినకుండా ఉంటాయని, కాబట్టి ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకాన్ని మాని పింగాణీ పాత్రల వైపు మొగ్గు చూపాలని ఆమె పిలుపునిచ్చారు. సమాజానికి మేలు చేసే ఇలాంటి మంచి కార్యక్రమాన్ని తలపెట్టిన సురక్ష కన్వీనర్ నరసయ్యను ఆమె అభినందించారు.

​కార్యక్రమ నిర్వాహకులు, సురక్ష కన్వీనర్ కే.వి. నరసయ్య మాట్లాడుతూ, ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో ఆవకాయ గొప్పతనాన్ని వివరిస్తూ చెప్పిన డైలాగులు ఎంతో ప్రజాదరణ పొందాయని గుర్తుచేశారు. ఆవకాయను మితంగా తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని, హార్వర్డ్ విశ్వవిద్యాలయం పరిశోధనల్లో కూడా కారం మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని తేలిందని పేర్కొన్నారు. పచ్చడిలో వాడే వెల్లుల్లి యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుందని, మెంతులు మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయని, అలాగే జుట్టు పెరుగుదలకు కూడా ఇది తోడ్పడుతుందని వివరించారు. ప్లాస్టిక్ మహమ్మారిని నిషేధించి, పాత సాంప్రదాయాలను పునరుద్ధరించాలనే సంకల్పంతోనే సీనియర్ ఎన్టీఆర్ ఏ ఐ తో తయారు చేసిన ప్రత్యేక గీతాన్ని, రూపొందించినట్లు నరసయ్య వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణి,సురక్ష ప్రతినిధులు సమత, శివలక్ష్మి,ప్రముఖ పారిశ్రామిక వేత్త మురళీ తదితరులు పాల్గొన్నారు.