Dog Attack : భైరవ తాండవం Andhra Prabha Top News

Dog Attack : భైరవ తాండవం Andhra Prabha Top News
- ఇంద్రకీలాద్రిపై భక్తుడిపై దాడి
- క్యూలైన్లలో స్వైర విహారం
- భక్తుల్లో భీతావహం
- భద్రతా వ్యవస్థ ఎక్కడ..?
- దేవస్థానం నిర్లక్ష్యంపై భక్తుల మండిపాటు..
- భక్తుల రక్షణ కంటే నిర్లిప్తతకే ప్రాధాన్యమా..?
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ:

Dog Attack : ఆధ్యాత్మిక క్షేత్రంగా లక్షలాది మంది భక్తుల విశ్వాసానికి నిలయమైన ఇంద్రకీలాద్రి పై ఇప్పుడు భక్తి కంటే భయం ఎక్కువగా కనిపిస్తోంది. అమ్మవారి దర్శనం కోసం వేలాదిగా వచ్చే భక్తులకు వీధి కుక్కల బెడద తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. భక్తుల రద్దీతో కిక్కిరిసే క్యూలైన్లలోనే కుక్కలు సంచరిస్తుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయాందోళన నెలకొంది.

మంగళవారం హైదరాబాద్‌కు చెందిన వినయ్ దంపతులు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం లో అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్లో వేచి ఉండగా అకస్మాత్తుగా ఒక వీధి కుక్క దాడి చేసి కాటేయడం కలకలం రేపింది. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో కుటుంబ సభ్యులు భయంతో ఉలిక్కిపడ్డారు. భక్తుల ఆందోళనల మధ్య దేవస్థానం సిబ్బంది బాధితుడిని మహామండపం ఏడో అంతస్తులోని వైద్య కేంద్రానికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అయితే అక్కడ కుక్కకాటు నివారణకు అవసరమైన యాంటీ రేబిస్ మందులు అందుబాటులో లేకపోవడం మరింత ఆశ్చర్యానికి గురిచేసింది. కేవలం టిటి ఇంజక్షన్‌తోనే సరిపెట్టడం దేవస్థానం వైద్య సన్నద్ధతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. కోట్లాది రూపాయల ఆదాయం వచ్చే దేవస్థానంలో కనీస అత్యవసర వైద్య సదుపాయాలు లేకపోవడం భక్తుల్లో అసహనాన్ని రగిలిస్తోంది.
Dog Attack : అన్ని ప్రాంతాలలో సంచారం…

ఇంద్రకీలాద్రి ప్రధాన గోపురం పరిసరాలు, రావిచెట్టు ప్రాంతం, మహామండపం, శివాలయ మార్గం, మెట్లదారి, క్యూలైన్లు—ఎక్కడ చూసినా కుక్కల గుంపులే కనిపిస్తున్నాయని భక్తులు వాపోతున్నారు. భక్తుల మధ్యే స్వైర విహారం చేస్తున్న కుక్కలను నియంత్రించడంలో సంబంధిత అధికారులు, భద్రతా సిబ్బంది పూర్తిగా విఫలమయ్యారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భక్తుల రక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన సమయంలో నిర్లక్ష్య ధోరణి కొనసాగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీసీ కెమెరాలు, భద్రతా తనిఖీలు, ప్రత్యేక పర్యవేక్షణ పేరుతో భారీ ఏర్పాట్లు చేస్తున్న అధికారులు, భక్తుల ప్రాణాలకు ముప్పుగా మారుతున్న వీధి కుక్కల సమస్యను మాత్రం పట్టించుకోవడం లేదని భక్తులు మండిపడుతున్నారు. ఇటీవల దేశవ్యాప్తంగా పెరుగుతున్న కుక్కకాటు ఘటనలపై సుప్రీంకోర్టు సైతం పలు మార్లు ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితుల్లో మార్పు కనిపించడం లేదని ప్రజలు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఇంద్రకీలాద్రి వంటి ప్రముఖ పుణ్యక్షేత్రంలో ఇలాంటి పరిస్థితులు కొనసాగడం దేవస్థానం పరిపాలన వైఫల్యానికి నిదర్శనమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ వెంటనే ప్రత్యేక చర్యలు చేపట్టాలని, కొండపై సంచరిస్తున్న వీధి కుక్కలను నియంత్రించి శాశ్వత పరిష్కారం చూపాలని భక్తులు, స్థానికులు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
aALSO READ : 27thMay 2026 | తిరుమల సమాచారం..
