జొన్నల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి

కుంటాల, ఆంధ్రప్రభ : ఆరుగాలం శ్రమించి పండించిన పంటలకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని ఆరోపిస్తూ శుక్రవారం కుంటాల మండల కేంద్రంలో ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్‌కు స్థానిక నాయకులు, రైతులు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కుంటాల మండలంలో మొక్కజొన్న, జొన్న, వరి పంటలను అధికంగా సాగు చేస్తున్నప్పటికీ ముఖ్యంగా జొన్న పంటకు సంబంధించి కొనుగోలు కేంద్రాలు ఇంకా ప్రారంభం కాలేదని తెలిపారు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.

వినతిపత్రాన్ని స్వీకరించిన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ మాట్లాడుతూ.. రైతుల సమస్యను సంబంధిత వ్యవసాయ శాఖ మంత్రి, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి జొన్నల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేలా చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు. రైతులు ఆందోళన చెందవద్దని, తాను ఎల్లప్పుడూ రైతులకు అండగా ఉంటానని తెలిపారు.

ప్రభుత్వ మద్దతు ధరతో జొన్నలను కొనుగోలు కేంద్రాల్లో విక్రయించుకునే అవకాశం కల్పించేలా ప్రభుత్వంతో చర్చించి కేంద్రాల ఏర్పాటు కోసం కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామాల సర్పంచులు, నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply