ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు అడుగులు వేయాలి – జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్

  • గుడిపల్లిలో పీఎండీఎస్ ప్రకృతి వ్యవసాయ క్షేత్రాల పరిశీలన..
  • ట్రాక్టర్‌తో స్వయంగా విత్తనాలు చల్లిన కలెక్టర్

శ్రీ సత్యసాయి, ఆంధ్రప్రభ: ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులందరూ ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేయాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ పిలుపునిచ్చారు. తక్కువ నీటితో అధిక లాభాలను అందించే పీఎండీఎస్ (Pre-Monsoon Dry Sowing) విధానాన్ని రైతులు విస్తృతంగా అనుసరించాలని సూచించారు.

మంగళవారం సోమందేపల్లి మండలంలోని గుడిపల్లి గ్రామంలో రైతు రంగప్పకు చెందిన సుమారు 40 ఎకరాల విస్తీర్ణంలో పీఎండీఎస్ విధానంలో సాగు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రాజెక్టు మేనేజర్ (డీపీఎం) లక్ష్మానాయక్ పీఎండీఎస్ విధానం, దాని ప్రయోజనాలు, వర్షాభావ పరిస్థితుల్లో ఈ పద్ధతి ద్వారా రైతులకు కలిగే లాభాలను కలెక్టర్‌కు వివరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశాలు ఉన్నందున రైతులు భూములను ఖాళీగా ఉంచకుండా ముందస్తు వర్షాలను సద్వినియోగం చేసుకుని పీఎండీఎస్ విధానంలో విత్తనాలు చల్లాలని సూచించారు. ఈ విధానం ద్వారా తక్కువ ఖర్చుతో సాగు చేయడంతో పాటు నేల సారాన్ని పరిరక్షించుకోవచ్చని, ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతులు స్థిరమైన ఆదాయాన్ని పొందగలరని పేర్కొన్నారు.

వ్యవసాయ పనుల పట్ల రైతుల్లో మరింత ఉత్సాహం నింపేందుకు కలెక్టర్ స్వయంగా పొలంలోకి దిగి ట్రాక్టర్ ద్వారా విత్తనాలు చల్లారు. అనంతరం రైతులతో ముచ్చటించి వారి సమస్యలు, సాగు విధానాలపై అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఆధునిక సాంకేతికతను ప్రకృతి వ్యవసాయంతో సమన్వయం చేసుకుంటూ సాగు చేస్తే మెరుగైన దిగుబడులు సాధించవచ్చని రైతులకు సూచించారు.

ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతులకు అండగా ఉంటుందని, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు అవసరమైన సహకారం అందిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. వ్యవసాయ పనుల్లో కలెక్టర్ ప్రత్యక్షంగా పాల్గొనడం స్థానిక రైతులను ఆకట్టుకుంది.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రాజెక్టు మేనేజర్ లక్ష్మానాయక్, సోమందేపల్లి తహసీల్దార్ మారుతి ప్రసాద్, ఎంపీడీవో వెంకటలక్ష్మమ్మ, మండల వ్యవసాయ అధికారిణి విజయభారతి, రాష్ట్ర సాగర్ కార్పొరేషన్ చైర్మన్ వెంకటరమణ, రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ డి.వి. ఆంజనేయులు, మండల కన్వీనర్ వెంకటేష్, జనసేన నాయకులు నాగరాజు, మాజీ ఎంపీటీసీ క్రిష్టప్ప, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.